జై శ్రీరామ్‌.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ | Jai Sri Ram: Raghu Sharma celebrates after maiden IPL wicket with MI | Sakshi
Sakshi News home page

జై శ్రీరామ్‌.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ

May 5 2026 11:10 AM | Updated on May 5 2026 12:15 PM

Jai Sri Ram: Raghu Sharma celebrates after maiden IPL wicket with MI

నోట్‌ చూపిస్తున్న రఘు శర్మ (PC: BCCI)

ఐపీఎల్‌లో పద్నాలుగేళ్లకే సంచలనాలు సృష్టించాడు వైభవ్‌ సూర్యవంశీ. అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో గుజరాత్‌పై) నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఐపీఎల్‌-2026 సందర్భంగా తన రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. వైభవ్‌ (Vaibhav Suryavanshi) వైభవం ఇలా ఉంటే.. రఘు శర్మ (Raghu Sharma)ది మరో కథ.

33 ఏళ్ల వయసులో...
పంజాబ్‌కు చెందిన లెగ్‌ స్పిన్నర్‌ రఘు శర్మ. అతడి వయసు ఇప్పుడు 33 ఏళ్లు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటినా ఐపీఎల్‌లో అరంగేట్రం కోసం అతడు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వచ్చింది. రఘును తొలుత నెట్‌బౌలర్‌గా చేర్చుకున్న ముంబై ఇండియన్స్‌.. గతేడాది వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.

అరంగేట్ర మ్యాచ్‌లో అలా
కానీ.. 2025లో రఘు శర్మకే బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే, ఈ ఏడాది ఎట్టకేలకు అతడిని ముంబై యాజమాన్యం కరుణించింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా రఘు ముంబై తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో పూర్తి నాలుగు ఓవర్ల కోటా వేసిన రఘు శర్మ.. 24 పరుగులే ఇచ్చాడు.

ఇప్పుడిలా..
పొదుపుగా బౌలింగ్‌ చేసినప్పటికీ చెన్నైతో మ్యాచ్‌లో రఘు వికెట్లు తీయలేకపోయాడు. అయితే, తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడి కల నెరవేరింది. లక్నో అరంగేట్ర బ్యాటర్‌ అక్షత్‌ రఘువన్షి (11) రూపంలో రఘు శర్మ ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ తీశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 36 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.  

ఈ నేపథ్యంలో రఘు శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, దూకుడుగా సెలబ్రేట్‌ చేసుకోకుండా.. తన జేబులో నుంచి ఓ పేపర్‌ తీసి డ్రెసింగ్‌రూమ్‌ వైపు చూపించాడు ఈ లెగ్‌ స్పిన్నర్‌. అందులో..

ఆ బాధ నేటితో తీరిపోయింది
‘‘రాధే రాధే. గత పదిహేనేళ్లు ఎంతో బాధగా గడిచాయి. అయితే, ఆ గురుదేవుడి దయ వల్ల ఆ బాధ నేటితో తీరిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్‌కు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను. జై శ్రీరామ్‌’’ అని రఘు శర్మ రాశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. వాంఖడేలో సోమవారం టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ముంబై 18.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్నోను ఆరు వికెట్ల తేడాతో ఓడించి సీజన్‌లో పదింట తమ మూడో విజయాన్ని నమోదు చేసింది.

చదవండి: నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్‌ ఫైర్‌!

Advertisement
 
Advertisement
Advertisement