మా స్థాయి ఇది కాదు.. రియాన్‌ పరాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | IPL 2026: Riyan Parag comments after losing to DC | Sakshi
Sakshi News home page

మా స్థాయి ఇది కాదు.. రియాన్‌ పరాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

May 18 2026 10:41 AM | Updated on May 18 2026 11:31 AM

IPL 2026: Riyan Parag comments after losing to DC

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (మే 17) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడి, ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ ఓటమి అనంతరం జట్టు ప్రదర్శనపై కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

ఈ ఓటమికి అన్ని విభాగాల వైఫల్యాలే కారణమని అంగీకరించాడు. బ్యాటింగ్‌లో 14 ఓవర్ల వరకు మంచి స్థితిలో ఉన్నప్పటికీ, తాను ఔటైన తర్వాత సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యిందని అన్నాడు. స్కోరు కనీసం 220-230 మధ్య ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.

బౌలింగ్‌ పరంగా కూడా జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదని తెలిపాడు. డోనోవన్‌ ఫెరియెరాకు బౌలింగ్‌ ఇవ్వడం జూదం కాదని, ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో రిస్క్‌ తీసుకున్నామని వివరించాడు. అయితే ఆ ప్రణాళిక పని చేయలేదని అంగీకరించాడు. 

ఫీల్డింగ్‌పై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరాగ్‌, ట్రోఫీ కోసం పోటీ పడాలంటే ఇలాంటి ప్రదర్శనలు అస్సలు సరిపోవని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

గత నాలుగైదు మ్యాచ్‌లుగా జట్టు తమ అసలు స్థాయిని చూపలేకపోతోందని, ముఖ్యంగా విరామం తర్వాత జట్టులో ఎనర్జీ, నైపుణ్యం తగ్గిపోయాయని అభిప్రాయపడ్డాడు. ఇలాగే ఆడితే టాప్‌-4 కోసం పోటీ పడే అర్హత కూడా ఉండదని స్పష్టం చేశాడు.

ప్లే ఆఫ్స్‌ అవకాశాలపై స్పందిస్తూ.. అది ఇతర జట్ల ఫలితాలపై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. నేను జట్టును నడిపించాలనుకున్న విధానం ఇది కాదు. నా జట్టుతో నేను మాట్లాడే తీరు కూడా ఇది కాదు. అవకాశం లభించింది, కానీ మేము దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాము. ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించలేకపోతే, అది పూర్తిగా మా తప్పే అవుతుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఏమి చేయగలమో పరిశీలించి విజయాలు సాధించాలని ఆశిస్తున్నానని అన్నాడు.

కాగా, నిన్నటి మ్యాచ్‌లో రాయల్స్‌ గెలిచే అవకాశాలు వచ్చినా గెలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. అనూహ్యంగా బ్యాటింగ్‌ పతనం, ఫీల్డింగ్‌ వైఫల్యాలు, రియాన్‌ పరాగ్‌ సాహసోపేత నిర్ణయాలు ఆ జట్టు కొంపముంచాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే రాయల్స్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. 

Advertisement
 
Advertisement
Advertisement