పోరాడి ఓడిన పంజాబ్‌.. గుజరాత్‌ను గెలిపించిన సుందర్‌ | IPL 2026, Match 46: Gujarat Titans beat Punjab Kings | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన పంజాబ్‌.. గుజరాత్‌ను గెలిపించిన సుందర్‌

May 3 2026 11:34 PM | Updated on May 3 2026 11:34 PM

IPL 2026, Match 46: Gujarat Titans beat Punjab Kings

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్‌ సుందర్‌ (40 నాటౌట్‌) సిక్సర్‌ బాది గుజరాత్‌ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్‌ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. 

అయితే గుజరాత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ చివ​రి ఓవర్‌ వరకు సాగింది. ఈ మధ్యలో పం​జాబ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బార్ట్‌లెట్‌ (4-0-38-2), అర్షదీప్‌ సింగ్‌ (4-0-24-2), జన్సెన్‌ (4-0-33-1), విజయ్‌ కుమార్‌ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. 

ఆఖరి ఓవర్‌ వేసిన స్టోయినిస్‌ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్‌లో ఓ ఫోర్‌, ఓ సిక్సర్‌ వచ్చింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (5), నిషాంత్‌ సంధు (15), తెవాతియా (2), హోల్డర్‌ (2) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. బట్లర్‌ (26) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి అర్షద్‌ ఖాన్‌ (8 నాటౌట్‌) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.

అంతకుముందు పంజాబ్‌ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. సూర్యాంశ్‌ షేడ్గే (57), మార్కస్‌ స్టోయినిస్‌ (40), ఆఖర్లో మార్కో జన్సెన్‌ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ (4-0-24-4) పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్‌ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టారు. 

మిగతా బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్‌ సుతార్‌ (1-0-27-0), అర్షద్‌ ఖాన్‌ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్‌ ఆర్మ 2, ప్రభ్‌సిమ్రన్‌ 15, కూపర్‌ కన్నోల్లీ డకౌట్‌, శ్రేయస్‌ అయ్యర్‌ 19, నేహల్‌ వధేరా, జేవియర్‌ బార్ట్‌లెట్‌ డకౌటయ్యారు. విజయ్‌ కుమార్‌, అర్షదీప్‌ తలో పరుగుతో అజేయంగా నిలిచారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement