హార్దిక్‌ పాండ్యాపై వేటు.. ముంబై కెప్టెన్‌గా తొలగింపు? | IPL 2026: Is Hardik Pandya To Be Sacked As Captain MI Stance Revealed | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ పాండ్యాపై వేటు.. ముంబై కెప్టెన్‌గా తొలగింపు?

May 5 2026 2:20 PM | Updated on May 5 2026 2:51 PM

IPL 2026: Is Hardik Pandya To Be Sacked As Captain MI Stance Revealed

రెండేళ్ల క్రితం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా. ముంబై సారథిగా అరంగేట్రంలోనే చేదు అనుభవం చవిచూశాడు. ఐపీఎల్‌-2024లో హార్దిక్‌ కెప్టెన్సీలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.

మళ్లీ పాత కథే 
అయితే, గతేడాది మాత్రం మంచి ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగింట ఎనిమిది గెలిచి ప్లే ఆఫ్స్‌ చేరింది. దీంతో హార్దిక్‌ కెప్టెన్సీపై విమర్శలు తగ్గాయి. కానీ ఈ సీజన్‌లో మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది. ఐపీఎల్‌-2026లో ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ముంబై కేవలం మూడు గెలిచింది.

సొంతమైదానం వాంఖడేలో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌పై గెలిచి.. మూడో విజయం నమోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా బదులు సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబై సారథిగా వ్యవహరించాడు. వెన్నునొప్పి కారణంగా హార్దిక్‌ మ్యాచ్‌కు దూరమైనట్లు యాజమాన్యం వెల్లడించింది.

కావాలనే పక్కనపెట్టారు
అయితే, ఇటు బ్యాటింగ్‌.. అటు బౌలింగ్‌లో విఫలమవుతూ.. కెప్టెన్‌గానూ తేలిపోతున్న హార్దిక్‌ పాండ్యాను కావాలనే పక్కనపెట్టారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు హార్దిక్‌పై వేటు వేసి అతడిని సారథ్య బాధ్యతల నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

యాజమాన్యం ఆలోచన ఏమిటి?
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం హార్దిక్‌ పాండ్యాకు మద్దతుగానే ఉండనున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ కథనం ప్రచురించింది. హార్దిక్‌ కెప్టెన్సీ శైలిపై యాజమాన్యానికి ఎలాంటి ఫిర్యాదులూ లేవని.. అతడు జట్టును విజయవంతంగా నడిపించగలడనే నమ్మకంతో ఉన్నట్లు పేర్కొంది.

కాగా వరుస ఓటముల నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తగా.. జట్టు సమిష్టి వైఫల్యానికి పాండ్యా ఒక్కడినే బాధ్యుడిని చేయలేమని హెడ్‌కోచ్‌ మహేళ జయవర్దనే ఇప్పటికే స్పష్టం చేశాడు. యాజమాన్యం సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముంబై ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్థాయికి తగ్గట్లుగా ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. 

చదవండి: జై శ్రీరామ్‌.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement