ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైన వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టోర్నీ ఆరంభానికి ముందే జట్లు పాటించాల్సిన ప్రాక్టీస్ సెషన్లు, పిచ్ నిర్వహణకు సంబంధించి కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా మ్యాచ్ రోజుల్లో ఎలాంటి ప్రాక్టీస్ సెషన్‌లకు ఇకపై అనుమతి ఉండదని పేర్కొంది.
కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు..
ఏ జట్టు కూడా సాధన సమయంలో తమ ప్రత్యర్థి ఉపయోగించిన పిచ్‌లను లేదా నెట్‌లను వాడకూడదు. ప్రతి సెషన్‌కు తాజాగా సిద్ధం చేసిన పిచ్‌లను తప్పనిసరిగా అందించాలి. ఉదాహరణకు, ఉదయం ‘టీమ్ బి’ ఉపయోగించిన పిచ్‌పై సాయంత్రం ‘టీమ్ ఎ’ సాధన చేయకూడదు.జట్లు ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, మొదటి జట్టు ఉపయోగించిన నెట్‌లను రెండవ జట్టుకు ఇవ్వరాదు.
మ్యాచ్ జరిగే రోజులలో ప్రాక్టీస్‌కు అనుమతి ఉండదు. మ్యాచ్ జరిగే రోజున ప్రధాన ప్రాంగణంలో ఎలాంటి ఫిట్‌నెస్ పరీక్ష జరగదు.
ప్రాక్టీస్ రోజుల్లో (ప్రీ టోర్నమెంట్, టోర్నీ జరుగుతున్న సమయంలో), గుర్తింపు పొందిన సిబ్బందిని మాత్రమే డ్రెస్సింగ్ రూమ్‌లోకి, మైదానంలోకి అనుమతిస్తారు.
ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేరే వాహనంలో ప్రయాణిస్తారు. హాస్పిటాలిటీ ఏరియా నుంచి జట్టు ప్రాక్టీస్‌ను వీక్షించే అవకాశం వీరికి కల్పిస్తారు.
అదనపు సహాయక సిబ్బంది (త్రో డౌన్ స్పెషలిస్ట్/నెట్ బౌలర్లు) జాబితా వివరాలను బీసీసీఐకి సమర్పించాలి. బీసీసీఐ ఆమోదం పొందిన తర్వాతే వీరికి గుర్తింపు పత్రాలు జారీ చేయబడతాయి.
ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు వచ్చేటప్పుడు టీమ్ బస్సును మాత్రమే ఉపయోగించాలి. జట్లు రెండు బృందాలుగా ప్రయాణించవచ్చు.
మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్, ఫిట్‌నెస్ టెస్ట్‌కు సంబంధించి ఎలాంటి అభ్యర్థన వచ్చినా స్థానిక మేనేజర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
మ్యాచ్ రోజు మార్గదర్శకాలు..
పీఎంవోఏ నుంచి గుర్తింపు పొందిన సిబ్బంది మ్యాచ్ రోజున తమ గుర్తింపు పత్రాన్ని తీసుకురావడం తప్పనిసరి. మొదటిసారి గుర్తింపు పత్రాన్ని తీసుకురాని పక్షంలో, హెచ్చరికతో సరిపెడతారు. కానీ రెండోసారి అదే తప్పు చేస్తే ఆయా జట్టుకు జరిమానా విధించబడుతుంది.
ఆటగాళ్లు నారింజ లేదా ఊదా రంగు టోపీలు ధరించాలి. ఒకవేళ ఆటగాళ్లు టోపీలు ధరించకపోతే, ప్రసారంలో కనిపించేంత వరకు మొదటి రెండు ఓవర్ల పాటు ఆ క్యాప్‌లను ధరించాలి.
మ్యాచ్ అనంతర బహుమతి ప్రదానోత్సవంలో ఫ్లాపీలు, స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదు. ఆటగాళ్లు రూల్‌ను పాటించకపోతే తొలిసారి హెచ్చరించడం జరుగుతుంది. రెండోసారి మాత్రం జరిమానా విధించడం జరుగుతుంది.
ఐపీఎల్ 2025 సీజన్ మాదిరిగానే, మ్యాచ్ రోజుల్లో టీమ్ డాక్టర్‌తో సహా 12 మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు.
ఆటగాళ్ల జెర్సీ నంబర్లలో మార్పు ఉన్నట్లయితే, ఆయా ఫ్రాంచైజీలు నిబంధనల ప్రకారం 24 గంటల ముందే వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.


