
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్షదీప్ సింగ్ పైసా వసూల్ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ పంజాబీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఆ సీజన్ మెగా వేలంలో ఆర్‌టీమ్ కార్డు ఉపయోగించి రూ. 18 కోట్లకు తిరిగి దక్కించుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే అర్షదీప్ ఈ సీజన్‌లో చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ సీజన్‌లో పంజాబ్ సాధించిన ప్రతి విజయంలో అర్షదీప్ ప్రధానపాత్ర పోషించాడు. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో అర్షదీప్ వికెట్లు తీశాడు. వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. నిన్న ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
లక్నో ప్రధాన బ్యాటర్లు, విధ్వంసకర వీరులు మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌ను తన తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో పంజాబ్ లక్నోపై ఆదిలోనే పట్టు సాధించి, చివరికి 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అర్షదీప్ మున్ముందు జరుగబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇలాంటి ప్రదర్శనలే కొనసాగిస్తే పంజాబ్ తొలి టైటిల్ గెలవడం ఖాయం.
ఈ సీజన్‌లో అర్షదీప్ ప్రదర్శనలు..
2/36 vs GT (4)
3/43 vs LSG (4)
1/35 vs RR (4)
0/39 vs CSK (4)
1/37 vs SRH (4)
1/11 vs KKR (3)
2/23 vs RCB (3)
1/26 vs RCB (3)
0/0 vs KKR (0)- వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది
2/25 vs CSK (3.2)
3/16 vs LSG (4)
నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (4 బంతుల్లో 1) విఫలమైనా, మిగతా బ్యాటర్లంతా సత్తా చాటారు.
వన్‌డౌన్‌లో వచ్చిన జోష్ ఇంగ్లిస్ 14 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 30, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45, నేహల్ వధేరా 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 16 పరుగులు చేశారు.
ఆఖర్లో శశాంక్ సింగ్ తాండవం చేశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో అజేయమైన 33 పరుగులు చేశాడు. ఇదే సమయంలో స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝులిపించాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రాఠీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. 73 పరుగులకే తమ కీలక బ్యాటర్ల వికెట్లన్నీ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో టాపార్డార్ పేకమేడలా కూలింది. అర్షదీప్ 27 పరుగులకే మార్క్రమ్ (13), మిచెల్ మార్ష్ (0), నికోలస్ పూరన్‌ను (6) ఔట్ చేశాడు.
ఆతర్వాత ఒమర్‌జాయ్.. రిషబ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్‌ను (11) పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 81 పరుగులు జోడించారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్ ఔటయ్యే సమయానికి (16.4వ ఓవర్) లక్నో 20 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉండింది. దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్ తొలి బంతికి బదోని కూడా ఔటయ్యాడు. దీంతో లక్నో ఓటమి ఖరారైపోయింది.
ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. అర్షదీప్ 3, ఒమర్‌జాయ్ 2, జన్సెన్, చహల్ తలో వికెట్ తీసి లక్నోను దెబ్బ కొట్టారు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (15 పాయింట్లు) చేరి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.
దాదాపు 10 సీజన్ల తర్వాత పంజాబ్ 15 పాయింట్లు సాధించింది. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఢిల్లీ (మే 8), ముంబై ఇండియన్స్ (మే 11), రాజస్థాన్‌తో (మే 16) తలపడాల్సి ఉంది.