IPL 2021: దుబాయ్‌లో ఐపీఎల్‌! 

IPL 2021 Will Tentatively Start In 3rd Week Of September In Dubai - Sakshi

సెప్టెంబర్‌ 18 లేదా 19 నుంచి అక్టోబర్‌ 10 వరకు మ్యాచ్‌ల నిర్వహణ

న్యూఢిల్లీ: మిగిలిన ఐపీఎల్‌ టి20 టోర్నమెంట్‌ మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. రోజూ రెండేసి మ్యాచ్‌లను ఎక్కువగా నిర్వహించి చకచకా లీగ్‌ను ముగించాలనే ప్రణాళికతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉంది. ఖాళీ ఉన్న సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో మూడు వారాల్లో ఏకబిగిన లీగ్‌ నిర్వహించాలని కసరత్తులు చేస్తోంది. ‘సెప్టెంబర్‌ 18 లేదంటే 19న ఈ సీజన్‌ పునఃప్రారంభం అవుతుంది. పది రోజులు రెండేసి మ్యాచ్‌ల్ని, ఏడు రోజులు ఒక్కో మ్యాచ్‌ నిర్వహిస్తాం. యూఏఈలో రెండు మూడు వేదికల్లో కాకుండా కేవలం దుబాయ్‌లోనే మ్యాచ్‌లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం’ అని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

అక్టోబర్‌ 9 లేదంటే 10వ తేదీన జరిగే ఫైనల్‌తో 14వ సీజన్‌ను ముగిస్తామని ఆయన అన్నారు. ఈ వారాంతంలో తుది షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. భారత్‌లో జరిగిన ఈ సీజన్‌ను కరోనా కాటేసింది. దీంతో ఈ నెల 4 నుంచి లీగ్‌ను భారత్‌లో రద్దు చేసింది. మిగిలిపోయిన 31 మ్యాచ్‌ల్ని యూఏఈకి తరలించింది. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటన కోసం ముంబైలో హార్డ్‌ క్వారంటైన్‌లో ఉంది. అక్కడ న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఆతిథ్య దేశంలో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతుంది. సెప్టెంబర్‌ 14న ఆఖరి టెస్టు ముగిసిన మరుసటి రోజే యూఏఈకి బయల్దేరుతుంది. ప్రత్యేక విమానంలో బబుల్‌ నుంచి బబుల్‌కు బదిలీ అవుతుంది. కాబట్టి మళ్లీ ప్రత్యేకించి క్వారంటైన్‌ కావాల్సిన అవసరమే ఉండదని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు ఇదివరకే ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చింది. 

దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌ రద్దు
భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా దక్షిణాఫ్రికా జట్టుతో ఆడాలనుకున్న టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను బోర్డు రద్దు చేసింది. ఐపీఎల్, మెగా ఈవెంట్‌కు మధ్య సమయం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండు టెస్టుల సిరీస్‌ను వాయిదా వేసింది. అందుబాటులో ఉన్న తేదీలను బట్టి దీన్ని రీషెడ్యూల్‌ చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది.

చదవండి: షారుక్‌ భాయ్‌ మమ్మల్ని వదల్లేదు.. రోజు ఎంక్వైరీ చేసేవాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top