
ఆసియాకప్-2025కు భారత జట్టు ప్రకటన కాస్త ఆలస్యం కానుంది. వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు విలేకరుల సమావేశంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గోవల్సింది.
కానీ ముంబైలో భారీ వర్షాల కారణంగా వీరిద్దరి ప్రెస్‌కాన్ఫరెన్స్ ఆలస్యమ్యే అవకాశం ఉందని బీసీసీఐ మీడియా సంస్థలకు సమాచారమిచ్చినట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ కథనంలో పేర్కొంది. కాగా ముంబైలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ముంబై వ్యాప్తంగా పాఠశాలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. ఒకవేళ వర్షం తగ్గుముఖం పట్టకపోతే అగార్కర్, సూర్య వర్చవల్‌గా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముంది.
ఆసియాకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ జట్టులో టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు చోటు దక్కుతుందా లేదా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్ స్లాట్ కోసం సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, అభిషేక్ శర్మల నుంచి గిల్‌కు తీవ్రమైన పోటీ ఉంది.
అయితే ఈ జట్టులో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు చేర్చినట్లు తెలుస్తోంది. అతడితో పాటు రియాన్ పరాగ్‌కు చోటు కల్పించినట్లు సమాచారం.
ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ.
చదవండి: KBC 2025: ఐపీఎల్‌పై రూ. 7.50 లక్షల ప్రశ్న.. సమాధానం మీకు తెలుసా?