Ind Vs Eng 4th Test‌: టీమిండియా ఘన విజయం

India Vs England 4th Test Day 3 Live Updates Telugu - Sakshi

ఇంగ్లండ్‌: 
తొలి ఇన్నింగ్స్‌: 205 ఆలౌట్‌
రెండో ఇన్నింగ్స్‌: 135 ఆలౌట్

టీమిండియా:
తొలి ఇన్నింగ్స్: 365 ఆలౌట్‌

టీమిండియా ఘన విజయం
టీమిండియా నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో అద్బుత విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా బౌలర్లో అశ్విన్‌, అక్షర్‌ చెరో 5 వికెట్ల తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచారు.

టీమిండియా నాలుగో టెస్టులో విజయానికి మరింత దగ్గరైంది. టీమిండియా స్పిన్నర్ల విజృంభణతో ఇంగ్లండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. తాజాగా ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది.అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 54.1 బంతిని జాక్‌ లీచ్‌ ఫ్లిక్‌ చేయగా.. స్లిప్‌లో ఉన్న రహానే ఏ మాత్రం తడబాటు లేకుండా అందుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ స్కోరు 134/9 గా ఉంది. అంతకముందు అక్షర్‌ పటేల్‌ తన వరుస ఓవర్లలో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌ 111 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. బెస్‌ వికెట్‌తో అక్షర్‌ పటేల్‌ టెస్టులో వరుసగా మూడో టెస్టులో 5 వికెట్ల ఫీట్‌ను అందుకోవడం విశేషం. 

ఇంగ్లండ్‌ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఇన్నింగ్స్‌ పరాజయం తప్పించుకోవాలంటే ఇంకా 95 పరుగులు చేయాల్సిన దశలో ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లొతు కష్టాల్లో పడింది. టీమిండియా స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌లు పోటీపడి వికెట్లు తీస్తుండగా.. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌‌ పరుగులు తీయడంలో కష్టపడుతున్నారు. రూట్‌ సహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఇప్పటికే పెవిలియన్‌ చేరుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.‌ డానియెల్‌ లారెన్స్‌ 19, బెన్‌ ఫోక్స్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ తడబడుతుంది. మొదటి రెండు వికెట్లు అశ్విన్‌ తీయగా.. తరువాతి తన వంతు అన్నట్లుగా అక్షర్‌ రెచ్చిపోయాడు. మొదట సిబ్లీని అవుట్‌ చేసిన అక్షర్‌ ఆ తర్వాత బెన్‌ స్టోక్స్‌ను అవుట్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్‌  ఇన్నింగ్స్‌ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే ఇంకా 127 పరుగులు చేయాల్సి ఉంది. అంతకముందు అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నిం‍గ్స్‌ 9వ ఓవర్‌ చివరి బంతిని సిబ్లీ స్వీప్‌ షాట్‌కు యత్నించగా.. బంతి గిల్‌ ప్యాడ్లను తాకి గాల్లోకి లేచింది. అప్పటికే ముందుకు వచ్చిన పంత్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో సిబ్లీ నిరాశగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 3వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది.

వెనువెంటనే రెండు వికెట్లు
లంచ్‌ విరామం తర్వాత ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అశ్విన్‌ తాను వేసిన వరుస రెండు బంతుల్లో ఓపెనర్‌ జాక్‌ క్రాలే(5 పరుగులు), బెయిర్‌ స్టోను డకౌట్‌గా వెనక్కి పంపించాడు. దీంతో ఇంగ్లండ్‌ 10 పరుగుల రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ‌
 
లంచ్‌ విరామం
► లంచ్‌ విరామ సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసింది. జాక్‌ క్రాలే 5, సిబ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన సిరాజ్‌ చివరి బంతిని క్రాలే ఫ్లిక్‌ చేయగా.. స్ట్రైట్‌ డ్రైవ్‌ను అందుకునే క్రమంలో సిరాజ్‌ గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో సిరాజ్‌ బొటనవేలికి గాయం అయింది. దీంతో అంపైర్లు లంచ్‌ విరామం ప్రకటించారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్‌ అయింది.

టీమిండియా ఆలౌట్‌
నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్‌ అయింది. సుందర్‌ 96 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 160 పరగులు ఆధిక్యంలో నిలిచింది. కాగా 365 పరుగుల వద్దే టీమిండియా చివరి మూడు వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. రూట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 113వ ఓవర్‌ చివరి బంతికి 43 పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌ అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత 114వ ఓవర్‌ వేసిన బెన్‌ స్టోక్స్‌ చివరి రెండు వికెట్లు తీశాడు. మొదటి బంతికి ఇషాంత్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన స్టోక్స్‌ మూడో బంతికి సిరాజ్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించిన సుందర్‌ సెంచరీ చేసే అవకాశం రాకపోవడం నిరాశను మిగిల్చింది. ఇంగ్లండ్‌ బౌలర్లో స్టోక్స్‌ 4, అండర్సన్‌ 3, జాక్‌ లీచ్‌ 2 వికెట్లు తీశారు.

భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
టీమిండియా బ్యాట్స్‌మన్‌ వాషింగ్టన్‌ సుందర్‌ నాలుగో టెస్టులో సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. అతని అక్షర్‌ పటేల్‌ 37 పరుగులతో చక్కగా సహకరిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఇప్పటివరకు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టు బిగించింది.

అహ్మదాబాద్‌: నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగోటెస్టులో మూడో రోజు ఆట ప్రారంభమైంది. ప్రస్తుతం టీమిండియా 7 వికెట్ల‌ నష్టానికి 305 పరుగులు చేసింది. వాషింగ్టన్‌ సుందర్‌ 70, అక్షర్‌ పటేల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు 104 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సంపాదించింది.  కాగా రెండో రోజు రోజు ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (118 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు. సుందర్‌, పంత్‌లు కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. అండర్సన్‌కు 3 వికెట్లు దక్కాయి.  

146 పరుగులకు 6 వికెట్లు... చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒకదశలో భారత్‌ స్కోరు ఇది. ఇంగ్లండ్‌ స్కోరు 205ను అలవోకగా దాటుతుందనుకుంటే మన టాప్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. ఇక ప్రత్యర్థికి ఆధిక్యం అందించడం ఖాయమనుకున్న స్థితిలో ఒకే ఒక్కడు మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు. తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడిన రిషభ్‌ పంత్‌ అద్భుత సెంచరీతో జట్టును ముందంజలో నిలిపాడు. అతనితోపాటు వాషింగ్టన్‌ సుందర్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో రెండో రోజు ముగిసేసరికి టీమిండియాకు పట్టు చిక్కింది. అండర్సన్, స్టోక్స్‌ తీవ్రంగా శ్రమించినా... చివరి సెషన్లోనే భారత్‌ ఏకంగా 141 పరుగులు సాధించడంతో రూట్‌ సేన కుదేలైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top