డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా బరిలోకి భారత్‌ | India enters the Chess Olympiad as defending champions | Sakshi
Sakshi News home page

డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా బరిలోకి భారత్‌

Sep 2 2026 12:51 AM | Updated on Sep 2 2026 12:51 AM

India enters the Chess Olympiad as defending champions

16 నుంచి చెస్‌ ఒలింపియాడ్‌  

సమర్‌కండ్‌ (ఉజ్బెకిస్తాన్‌): రెండేళ్ల క్రితం అసాధారణ ఆటతీరుతో ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో ఓపెన్‌ విభాగంలో, మహిళల విభాగంలో భారత జట్లు చాంపియన్స్‌గా అవతరించాయి. అప్పటి జోరును ఈసారీ పునరావృతం చేసి రెండు విభాగాల్లోనూ టైటిల్స్‌ నిలబెట్టుకోవాలని భారత జట్లు ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతున్నాయి. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌ పట్టణంలో ఈనెల 16 నుంచి 27వ తేదీ వరకు చెస్‌ ఒలింపియాడ్‌ జరగనుంది. ఓపెన్, మహిళల విభాగాల్లో స్విస్‌ ఫార్మాట్‌లో 11 రౌండ్ల చొప్పున నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 15న ప్రారంభోత్సవం జరుగుతుంది. సెప్టెంబర్‌ 16 నుంచి 21వ తేదీ వరకు ఆరు రౌండ్‌లు జరుగుతాయి. 22వ తేదీన విశ్రాంతి దినం. సెపె్టంబర్‌ 23 నుంచి 27 వరకు మిగతా ఐదు రౌండ్‌లను నిర్వహిస్తారు. 

ఓపెన్‌ విభాగంలో 208 దేశాలు... మహిళల విభాగంలో 190 దేశాలు పోటీపడనున్నాయి. ఓపెన్‌ విభాగంలో ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, నిహాల్‌ సరీన్, దొమ్మరాజు గుకేశ్, విదిత్‌... మహిళల విభాగంలో కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, వంతిక అగర్వాల్, సవితాశ్రీ భారత జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు.  హంగేరి రాజధాని బుడాపెస్ట్‌ వేదికగా జరిగిన 2024 చెస్‌ ఒలింపియాడ్‌లో ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత మహిళల జట్టు... దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత ఓపెన్‌ జట్టు టైటిల్స్‌ సొంతం చేసుకున్నాయి. 

అంతేకాకుండా వ్యక్తిగత విభాగాల్లో బోర్డు–1పై గుకేశ్, బోర్డు–3పై అర్జున్‌ స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల వ్యక్తిగత విభాగంలో బోర్డు–3పై దివ్య దేశ్‌ముఖ్, బోర్డు–4పై వంతిక అగర్వాల్‌ పసిడి పతకాలు గెలిచారు. 2024లో ఓపెన్‌ విభాగంలో ఆడిన పెంటేల హరికృష్ణ స్థానాన్ని ఈసారి నిహాల్‌ సరీన్‌ భర్తీ చేయనున్నాడు. 2024లో మహిళల విభాగంలో పోటీపడ్డ ద్రోణవల్లి హారిక, తానియా సచ్‌దేవ్‌ ఈసారి బరిలోకి దిగడంలేదు. హారిక స్థానంలో కోనేరు హంపి, తానియా స్థానంలో సవితాశ్రీ ఆడనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement