IND Vs SL: మొహాలీ టెస్ట్‌లో గెలుపు అనంతరం రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై దిగ్గజ క్రికెటర్‌ కీలక వ్యాఖ్యలు

IND Vs SL: Sunil Gavaskar Rated Rohit Sharma Captaincy In Mohali Test - Sakshi

కెప్టెన్‌గా అరంగేట్రం టెస్ట్‌లోనే అద్భుత విజయాన్ని అందుకున్న రోహిత్‌ శర్మపై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌తోనే రోహిత్ ఆక‌ట్టుకున్నాడ‌ని, అత‌ను బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ అద్భుతంగా ఉన్నాయని, ఇందుకు రోహిత్‌కు 10కి 9.5 రేటింగ్ పాయింట్లు ఇస్తానని సన్నీ తెలిపాడు. రోహిత్‌ చాకచక్యంగా ఫీల్డింగ్‌ సెట్‌ చేయడంతో టీమిండియా ఆటగాళ్లు ఎక్కువ‌గా క‌ద‌లాల్సిన అవ‌స‌రం రాలేద‌ని, ఈ విషయంలో రోహిత్‌ తన ఐపీఎల్‌ అనుభవాన్నంతా ఉపయోగించాడని కితాబునిచ్చాడు. 

బౌలింగ్‌లో జ‌డేజాను స‌రైన స‌మ‌యంలో వాడుకున్నాడని అభిప్రాయ‌ప‌డ్డాడు. మొత్తంగా రోహిత్‌ కెప్టెన్సీ కారణంగానే టీమిండియా మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిందని కొనియాడాడు. రోహిత్ సొంత నిర్ణయాలు తీసుకుని జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని ప్రశంసించాడు. రోహిత్‌కు సీనియర్లు బాగా సహకరించారని, ఇది టీమిండియాకు శుభపరిణామమని చెప్పుకొచ్చాడు. 

ఇదిలా ఉంటే, మొహాలీ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 222 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ర‌వీంద్ర జ‌డేజా ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శన (175 నాటౌట్‌, 9 వికెట్లు)తో టీమిండియాకు మరపురాని విజయాన్నందించాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 574-8 వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, శ్రీ‌లంక తొలి ఇన్నింగ్స్‌లో 174, రెండో ఇన్నింగ్స్‌లో 178 ప‌రుగులకు చాపచుట్టేసింది. అబ్బురపోయే ప్రదర్శనతో అదరగొట్టిన జడేజాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌ బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ పింక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌ ఫార్మాట్‌లో జరగనుంది. 
చదవండి: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top