Sunil Gavaskar: కేఎల్‌ రాహుల్ కెప్టెన్సీపై విరుచుకుపడ్డ లిటిల్‌ మాస్టర్‌

IND Vs SA: Sunil Gavaskar Remarks KL Rahul Errors In Captaincy - Sakshi

టీమిండియా తాత్కాలిక టెస్ట్‌ సారధి కేఎల్‌ రాహుల్‌పై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. జొహానెస్‌బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో జట్టు ఓటమికి రాహుల్‌ కెప్టెన్సీ వైఫల్యమే కారణమని మండిపడ్డాడు. రాహుల్‌ చెత్త నిర్ణయాల వల్లే టీమిండియా ఓటమిపాలైందని ఫైరయ్యాడు. 

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌(ఛేదన)లో రాహుల్ ఫీల్డ్ సెటప్ దారుణంగా ఉందని, అతని అనుభవరాహిత్యం కారణంగా భారత్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆరోపించాడు. సాధారణంగా బంతిని హుక్‌ చేయని ఎల్గర్‌కు డీప్‌లో ఫీల్డర్లను మొహరించి, రాహుల్‌ చాలా పెద్ద తప్పిదం​ చేశాడని, దీన్ని సద్వినియోగం చేసుకున్న ఎల్గర్‌ సులభంగా సింగిల్స్‌ రాబట్టి క్రీజులో పాతుకుపోయాడని అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సన్నీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 

కాగా, వెనునొప్పి కారణంగా ఆఖరి నిమిషంలో కోహ్లి తప్పుకోవడంతో రెండో టెస్ట్‌లో కేఎల్‌ రాహుల్‌ టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ (188 బంతుల్లో 96 నాటౌట్‌; 10 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా మూడు దశాబ్దాల కలకు బ్రేకులు పడ్డాయి. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టెస్ట్‌ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: కోహ్లికి బ్యాటింగ్‌లో విఫలమయ్యే హక్కు ఉంది..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top