IND VS NZ 1st T20: టీమిండియాతో కలిసి సందడి చేసిన ధోని

IND VS NZ 1st T20: Dhoni Visits Team India Dressing Room, BCCI Shares Video - Sakshi

3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రాంచీ వేదికగా రేపు (జనవరి 27) తొలి మ్యాచ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఓ అనుకోని అతిధి ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తడంతో పాటు జట్టు సభ్యుల్లో జోష్‌ నింపాడు. ఆ స్పెషల్‌ పర్సన్‌ ఎవరంటే..? టీమిండియా మాజీ కెప్టెన్‌, లోకల్‌ హీరో మహేంద్రసింగ్‌ ధోని.

టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రత్యక్షమైన ధోనిని చూసి యువ భారత సభ్యులు ఉబ్బితబ్బిబైపోయారు. ధోనితో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ధోని సైతం హుషారుగా యువ సభ్యులతో మాటలు కలుపుతూ, సలహాలిచ్చాడు. హార్ధిక్‌, ఇషాన్‌, గిల్‌, సూర్యకుమార్‌, చహల్‌, సుందర్‌.. ఇలా దాదాపుగా ప్రతి సభ్యుడు మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌తో కలియతిరిగారు.

ధోని సైతం వారితో సరదాగా గడిపారు. చాలాకాలం తర్వాత కలిసిన భారత నాన్‌ ప్లేయింగ్‌ బృంద సభ్యులకు ధోని షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ఇవాళ (జనవరి 26) తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా, ప్రస్తుతం వైరలవుతోంది. ధోనిని చాలాకాలం తర్వాత చూసిన ఫ్యాన్స్‌ తెగ సంబురపడిపోతున్నారు. కాగా, మహేంద్రుడి స్వస్థలం జార్ఖండ్‌లోని రాంచీ అన్న విషయం తెలిసిం‍దే. 

ఇదిలా ఉంటే, భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రేపు రాత్రి 7 గంటల నుంచి తొలి టీ20 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన జోష్‌లో టీమిండియా ఉండగా.. ఈ సిరీస్‌నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్‌ పట్టుదలగా ఉం‍ది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టీ20 జనవరి 29న లక్నోలో, మూడో మ్యాచ్‌ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరుగనుంది. 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా, రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుం‍దర్‌, శివమ్‌ మావీ, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యుజ్వేంద్ర చహల్‌, ముకేశ్‌ కుమార్‌

న్యూజిలాండ్‌ జట్టు..
మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్‌), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, డారల్‌ మిచెల్‌, మైఖేల్‌ రిప్పన్‌, మార్క్‌ చాప్‌మన్‌, ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, డేన్‌ క్లీవర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, జాకబ్‌ డఫ్ఫీ, బెన్‌ లిస్టర్‌, ఐష్‌ సోధీ, లోకీ ఫెర్గూసన్‌, హెన్రీ షిప్లే, బ్లెయిర్‌ టిక్నర్‌  
 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top