ఒకే సీజన్లో 67 వికెట్లు.. అయినా పట్టించుకోరు! | Ignored Despite 67 Wickets Shami Strong Message To Ajit Agarkar | Sakshi
Sakshi News home page

ఒకే సీజన్లో 67 వికెట్లు.. అయినా పట్టించుకోరు!

Mar 31 2026 4:29 PM | Updated on Mar 31 2026 5:44 PM

Ignored Despite 67 Wickets Shami Strong Message To Ajit Agarkar

గత కొన్నాళ్లుగా టీమిండియా సెలక్షన్‌ కమిటీ వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని పట్టించుకోవడం మానేసింది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారత్‌ ఫైనల్‌ చేరడంలో ఈ రైటార్మ్‌ బౌలర్‌ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలోనూ షమీది ముఖ్య భూమిక.

అయితే, దాదాపు మూడేళ్లుగా షమీకి టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఇక వన్డేల్లో మేజర్‌ టోర్నీల్లో సత్తా చాటినా.. ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఫిట్‌నెస్‌ సమస్యల వల్లే షమీని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్వయంగా వెల్లడించాడు.

ఒకే సీజన్లో 67 వికెట్లు..
కానీ షమీ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించడమే కాకుండా.. పూర్తి ఫిట్‌నెస్‌తో దేశవాళీ క్రికెట్‌ బరిలో దిగి సత్తా చాటాడు. బెంగాల్‌ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌ ఊహాగానాలు వస్తుండగా షమీ స్పందించాడు. శుభంకర్‌ మిశ్రా షోలో మాట్లాడుతూ.. ‘నేను అలసిపోయానని భావించిన మరుక్షణం రిటైర్‌ అవుతాను. అంతేగాని ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదు. నిజానికి రిటైర్మెంట్‌ గురించి ఆలోచిస్తే మనం వెనుకబడి పోతాము.

 ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నా
ముందుగా చెప్పినట్లు నేను అలసిపోయాను.. ఆడలేను అని భావించినపుడే నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నేను ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అందుకు తగ్గట్లే సానుకూల ఫలితాలు వస్తున్నాయి’ అని షమీ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ షమీని లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘బౌలర్‌గా వంద శాతం బాధ్యతలు నిర్వర్తించగలను.

అంచనాలు అందుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. మిగతాదంతా నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. దానిని నేనైతే మార్చలేను. అంకితభావంతో ఆడటం మాత్రమే నా పని. లక్నో నన్ము నమ్మింది. కచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’’ అని షమీ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున 2023లో చివరగా టెస్టు ఆడిన షమీ.. 2025లో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు వైభవ్‌ సూర్యవంశీని పంపండి: మైకేల్‌ వాన్‌

Advertisement
 
Advertisement
Advertisement