అదే జ‌రిగితే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియ‌న్స్‌! | How Mumbai Indians Can Still Qualify For IPL 2026 Playoffs-7th Loss | Sakshi
Sakshi News home page

IPL 2026: అదే జ‌రిగితే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియ‌న్స్‌!

May 3 2026 12:48 PM | Updated on May 3 2026 1:51 PM

How Mumbai Indians Can Still Qualify For IPL 2026 Playoffs-7th Loss

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో శ‌నివారం సీఎస్‌కేతో క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓట‌మి పాలైన ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్ అవ‌కాశాల‌ను మ‌రింత క్లిష్టం చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవ‌లం రెండు విజ‌యాలు మాత్ర‌మే సాధించిన ఐపీఎల్ మాజీ చాంపియ‌న్ ఇప్పుడు ప్లేఆఫ్ చేర‌డం దాదాపు అసాధ్య‌మే. 

అయితే కొంత అదృష్టం క‌లిసి రావ‌డంతో మిగిలిన 5 మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధిస్తే మాత్రం ముంబైకి ప్లేఆఫ్ అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్పొచ్చు. కానీ ప్లేఆఫ్స్ చేరే క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్‌ ముందున్న దారి చాలా కఠినమ‌ని చెప్పొచ్చు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో, 4 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది. 

జట్టు నెట్ రన్ రేట్ (-0.803) సైతం చాలా దారుణంగా ఉండటం గ‌మ‌నార్హం. ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. అయితే ప్రస్తుతం ముంబై వద్ద ఉన్నది కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే. అంటే, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై తన మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ క‌చ్చితంగా గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

ఒకవేళ ముంబై అదృష్టం క‌లిసి వ‌చ్చి ఐదు మ్యాచ్‌లు గెలిచి న‌ప్ప‌టికీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి. అదే స‌మ‌యంలో ముంబై తాము ఆడ‌బోయే ఐదింటిలో ఒక్క‌టి ఓడినా సీజ‌న్‌లో వారి ప్ర‌యాణం ముగిసిన‌ట్లే. 

ముంబై త‌మ త‌ర్వాతి మ్యాచ్‌ల్లో భాగంగా సోమ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో, మే 10న రాయ్‌పూర్ వేదిక‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, మే 14న టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్‌తో ధర్మ‌శాల‌లో తలపడాల్సి ఉంది. ఆ తర్వాత మే 20న‌ కోల్‌క‌తా నైట్ రైడర్స్‌, మే 24న రాజస్తాన్ రాయ‌ల్స్‌తో ఆడాల్సి ఉంది. 

ఈ ఐదింటిలో గెల‌వ‌డంతో పాటు ర‌న్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. గణాంకాల పరంగా అవకాశం ఉన్నప్పటికీ, ముంబై ప్రస్తుత ఫామ్ చూసుకుంటే మాత్రం అద్భుతం జరిగితే తప్ప ప్లేఆఫ్స్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.

చదవండి: ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై.. వీడియో వైర‌ల్‌!

Advertisement
 
Advertisement
Advertisement