
మహిళల వన్డే ప్రపంచకప్-2025కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్-బ్రంట్ వ్యవహరించనుంది. ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్‌లో స్కైవర్-బ్రంట్ బ్రంట్ సారథ్యం వహించడం ఇదే తొలిసారి.
అదేవిధంగా తొడ కండరాల గాయం కారణంగా గత కొన్ని నెలలగా ఆటకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ హీథర్ నైట్ తిరిగి జట్టులోకి వచ్చింది. నైట్ తిరిగి రావడంతో ఇంగ్లండ్ మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారింది. ఉపఖండ పరిస్థితులకు తగ్గట్టు సెలక్టర్లు ఎక్కవగా స్పిన్ విభాగంపై దృష్టిసారించారు.
దీంతో స్పిన్నర్ల కోటాలో గ్లెన్, సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్, లిన్సే స్మిత్‌లకు చోటు దక్కింది. కాగా ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంక వేదికలగా జరగనుంది. ఇటీవల సిరీస్‌లలో నిరాశపరిచిన కేట్ క్రాస్, మైయా బౌచియర్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు.
ఇంగ్లండ్ అత్యంత అనుభవజ్ఞులైన బౌలర్లలో ఒకరిగా నిలిచిన క్రాస్.. గతేడాది నుంచి గాయాలు,పేలవ ఫామ్‌తో సతమతమవుతోంది. ఆమె స్ధానాన్ని యువ పేసర్ ఎమ్ ఆర్లోట్‌తో భర్తీ చేశారు. కాగా ఈ మెగా ఈవెంట్‌లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 3న బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఐదవ వన్డే ప్రపంచ కప్ టైటిలే లక్ష్యంగా ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది.
మహిళల ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ జట్టు: ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, అమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్.
చదవండి: సిరాజ్, రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్