T20 WC semifinal: పోరాడి ఓడిన టీమిండియా.. అయ్యో హర్మన్‌!

Heartbreak for India in semi final as Australia reach 7th successive final - Sakshi

మహిళల టీ20 ప్రపంచకప్‌-2023లో టీమిండియా ప్రయాణం ముగిసింది. కేప్‌టౌన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసీస్‌ చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసిన భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది.

అయితే భారత విజయం ఖాయం అనుకున్న దశలో..  కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్‌ రనౌట్‌గా వెనుదిరిగడం మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన హర్మన్‌ కీలక సమయంలో రనౌట్‌గా వెనుదిరిగింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. కాగా ఆనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ హర్మన్‌ అద్భుతమైన పోరాటపటిమ కనబరిచింది. హర్మన్‌ పాటు జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 43 పరుగులు) రాణించింది.

ఇక​ ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్‌,గార్డనర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా స్కాట్‌, జానసెన్‌ తలా వికెట్‌ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్‌ మూనీ(54),మెగ్‌ లానింగ్‌(49 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్‌, దీప్తి శర్మ తలా వికెట్‌ సాధించారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా 7వసారి కావడం గమనార్హం.
చదవండి: T20WC: ఆసీస్‌ బ్యాటర్‌పై కోపంతో ఊగిపోయిన షఫాలీ.. గట్టిగా అరుస్తూ! వీడియో​వైరల్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top