Cristiano Ronaldo: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం! పోస్ట్‌ వైరల్‌

FIFA WC 2022: Virat Kohli Emotional Note For Ronaldo As Portugal Exit - Sakshi

FIFA World Cup 2022- Virat Kohli- Cristiano Ronaldo: ‘‘క్రీడా రంగానికి నువ్వు చేసిన సేవ ఎనలేనిది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులను అలరించిన తీరు మరువలేనిది.. నువ్వు ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోవడం.. కేవలం నాకే కాదు.. నాలాంటి ఎంతో మంది అభిమానులకు దేవుడిచ్చిన వరం అది. 

ప్రతి మ్యాచ్‌లోనూ నీ కఠోర శ్రమ, నీ అంకితభావం మాకు కనిపిస్తూనే ఉంటుంది. వందకు వంద శాతం ఆటకు న్యాయం చేయడమే పరమావధిగా భావించగలగడం ఆటగాడికి దక్కిన ఆశీర్వాదం లాంటిది. ప్రపంచంలోని ప్రతి ఆటగాడికి అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అవుతాడు. నా దృష్టిలో అత్యుత్తమ ఆటగాడి(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌- GOAT)వి నువ్వే!

మా అందరిని ఇంతగా అలరించిన నువ్వు  ట్రోఫీ గెలవకపోతేనేం..? టైటిల్‌ సాధించకపోతేనేం? అదేమీ పెద్ద విషయం కానేకాబోదు. నీ ఆట తీరుతో మా మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న నీ గురించి వర్ణించడానికి ఎలాంటి ట్రోఫీలు, టైటిళ్లు అక్కర్లేదు’’ అంటూ టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను ఉద్దేశించి ఈ మేరకు ఉద్వేగపూరిత నోట్‌ రాశాడు. 

కల చెదిరింది!
ఫిఫా ప్రపంచకప్‌-2022లో భాగంగా మొరాకో చేతిలో ఓటమితో.. టైటిల్‌ దిశగా సాగాలనుకున్న పోర్చుగల్‌ ఆశలకు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో ఖతర్‌ వేదికగా సాగుతున్న ఈ మెగా ఈవెంట్‌ క్వార్టర్‌ ఫైనల్లోనే పోర్చుగల్‌ కథ ముగిసింది. కాగా ఇంతవరకు ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు.

కన్నీరే మిగిలింది!
అదే విధంగా.. ఆ జట్టు కెప్టెన్‌, మేటి ఫుట్‌బాల్‌ ఆటగాడు రొనాల్డోకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్‌ టోర్నీ కానుందన్న అభిప్రాయాల నేపథ్యంలో అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రపంచకప్‌ ట్రోఫీ సాధించాలనుకున్న 37 ఏళ్ల రొనాల్డో కల కలగానే మిగిలిపోయినట్లయింది. ఈ పరాజయాన్ని తట్టుకోలేక అతడు కన్నీటిపర్యంతమైన తీరు అభిమానుల చేత కంటతడి పెట్టించింది.

రొనాల్డోపై కోహ్లి అభిమానం
ఈ క్రమంలో రొనాల్డోపై అభిమానం చాటుకుంటూ కోహ్లి సోషల్‌ మీడియా వేదికగా అతడికి అండగా నిలబడ్డాడు. ఇన్‌స్టాలోనూ ఈ మేరకు రొనాల్డో ఫొటో పంచుకోగా.. గంటల్లోనే వైరల్‌గా మారింది. నాలుగు గంటల్లోనే 30 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇక 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కోహ్లి.. కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. అయితే, టెస్టుల్లో టీమిండియాను నంబర్‌ 1గా నిలపడం సహా 72 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా ఎన్నో ఘనతలు తన ఖాతాలో ఉన్నాయి.

చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే!
సంజూ శాంసన్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన పరాయి దేశం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top