Trolls On Dinesh Karthik: 'జట్టులో ఎందుకున్నాడో మరిచిపోయాడు.. గుర్తుచేయండి'

Fans Troll Dinesh Karthik Batting Failure Forget His-Finisher Role - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కార్తిక్‌ ఐదు బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సీజన్‌లో ఆరో మ్యాచ్‌ ఆడుతున్న కార్తిక్‌ వరుసగా 0,9,1*,0,28,7 పరుగులు చేశాడు. ఆరు మ్యాచ్‌లు కలిపి కేవలం 45 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.

ఇందులో ఒక మ్యాచ్‌లో ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి ఒక్క పరుగుతో నాటౌట్‌గా ఉన్నాడు.. కానీ మిగతా ఐదు మ్యాచ్‌ల్లో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అసలు దినేశ్‌ కార్తిక్‌ ఆర్‌సీబీ జట్టులోకి వచ్చిందే ఫినిషర్‌ పాత్రలో. గత సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేసి మంచి ఫినిషర్‌గా గుర్తింపు పొంది ఏకంగా టి20 వరల్డ్‌కప్‌లోనే చోటు దక్కించుకున్నాడు. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన కార్తిక్‌ పెద్దగా రాణించలేకపోయాడు.


Photo: IPL Twitter

కనీసం ఐపీఎల్‌లో అయినా తన ఫినిషర్‌ పాత్రను పోషిస్తాడనుకుంటే అదీ లేదు. సీఎస్‌కేతో జరిగిన లాస్ట్‌ మ్యాచ్‌లో కార్తిక్‌ 14 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌లు సుడిగాలి ఇన్నింగ్స్‌లతో చెలరేగి ఆర్‌సీబీని రేసులో ఉంచారు. కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కార్తిక్‌ ఆరంభంలో దూకుడు ప్రదర్శించినప్పటికి చివరి వరకు నిలబడలేకపోయాడు.

ఫినిషర్‌ అంటే చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను పూర్తి చేయాలి. అది ఓటమి అయినా గెలుపు అయినా. కానీ కార్తిక్‌ ఆ సూత్రం మరిచిపోయాడు. టార్గెట్‌ను చేధించాలనే కోరికతో ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్‌ను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యింది.


Photo: IPL Twitter

తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ కార్తిక్‌ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌లు 16 ఓవర్లలో 137/0తో మంచి ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో కోహ్లి, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ ఔటయ్యారు. ఈ దశలో ఆర్‌సీబీకి ఇంకా మూడు ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఫినిషర్‌ అనేవాడు ఆఖర్లో తక్కువ ఓవర్లుంటే హిట్టింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ కార్తిక్‌ తాను ఫినిషర్‌ అన్న విషయమే మరిచిపోయి మెల్లిగా ఆడాడు. ఆడిన ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడి అంటే పర్లేదు.. కానీ తొలి ఇన్నింగ్స్‌లో అలా ఉండదు. ఒత్తిడి ఉండదు కాబట్టి వచ్చిన బ్యాటర్లు యథేచ్చగా బ్యాట్‌ ఝులిపించే అవకాశం ఉంటుంది. కానీ కార్తిక్‌ మాత్రం అలా చేయలేకపోయాడు. దీంతో అభిమానులు కార్తిక్‌పై ట్రోల్స్‌ వర్షం కురిపించారు. ''కార్తిక్‌ తన రోల్‌ ఏంటో మరిచిపోయినట్లున్నాడు.. గుర్తుచేయాల్సిన అవసరం వచ్చింది..'' అంటూ కామెంట్‌ చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top