
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ అభిమానులను అవాక్కయ్యేలా చేశాడు. తన కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ను నోరెళ్లబెట్టుకునేలా చేశాడు. తాజాగా వార్నర్ సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వింటేజ్ లుక్‌ను పోలి ఉన్నాడు. పొడవాటి జట్టుతో కెరీర్ తొలినాళ్లలోని ధోనిలా కనిపించాడు.

“It’s coming along well” అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో బ్లాక్ టీషర్ట్‌లో చిరునవ్వుతో కనిపించిన వార్నర్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోటో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది. వార్నర్ కొత్త లుక్ చూసి అభిమానులు ఔరా అంటున్నారు. ఇదేంది డేవిడ్ భాయ్, ఈ లుక్‌లో అచ్చం ధోనిలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.
వార్నర్ తన కెరీర్‌లో ఎప్పుడూ ఇంత పొడవాటి జట్టుతో కనిపించలేదు. లాంగ్ హెయిర్‌లో వార్నర్‌ను చూసి తొలుత చాలామంది అనుమానపడ్డారు. విగ్ పెట్టుకున్నాడా అని చెక్ చేసుకున్నారు. వార్నర్‌కు చిత్రవిచిత్ర పోస్ట్‌లతో నెటిజన్లను అవాక్కయ్యేలా చేసిన చరిత్ర ఉంది.
అందుకే జనాలు వార్నర్ తాజా లుక్‌ను అంత ఈజీగా నమ్మలేదు. జనాలకు ఆట పట్టించడానికి విగ్గు పెట్టుకుని ఉంటాడని అనుకున్నారు. అయితే అది నిజమని తెలిసి నిశ్రేష్ఠులవుతున్నారు. డేవిడ్ భాయ్ జట్టు పెంచితే ఇంత స్మార్ట్‌గా ఉంటాడా అని అనుకుంటున్నారు.
వార్నర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి, ప్రస్తుతం ప్రైవేట్ లీగ్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తాజాగా అతను హండ్రెడ్ లీగ్‌లో పాల్గొని వరుస హాఫ్ సెంచరీలతో పర్వాలేదనపించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని అధిగమించి, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
క్రిస్ గేల్- 14,562
డేవిడ్ వార్నర్- 13,595
విరాట్ కోహ్లీ- 13,543