ప్లే ఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చిన సీఎస్‌కే | CSK Qualification Scenario For IPL 2026 Playoffs After Win vs DC | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చిన సీఎస్‌కే

May 6 2026 12:55 PM | Updated on May 6 2026 1:14 PM

CSK Qualification Scenario For IPL 2026 Playoffs After Win vs DC

ఐపీఎల్‌ 2026లో ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది. సీజన్‌ ప్రారంభంలో అదరగొట్టిన ఢిల్లీ, లక్నో లాంటి జట్లు పత్తా లేకుండా పోగా.. సీజన్‌ను చెత్తగా ప్రారంభించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ అమాంతం ప్లే ఆఫ్స్‌ రేసులో దూసుకొచ్చింది. హ్యాట్రిక్‌ పరాజయాలతో సీజన్‌ను ప్రారంభించినా.. ఆతర్వాతి 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి టైటిల్‌ ఫేవరెట్‌గా మారింది.

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయానంతరం సీఎస్‌కే పాయింట్ల సంఖ్య 10కి చేరింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 5 అపజయాలు నమోదు చేసింది. ఈ జట్టు రన్‌రేట్‌ కూడా మెరుగ్గా (0.151) ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్నా, మున్ముందు టాప్‌-4లోకి దూసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ జట్టు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగింట 3 విజయాలు సాధించినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు ఢోకా ఉండకపోవచ్చు. నాలుగూ గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్జాగా ఫైనల్‌-4కు చేరవచ్చు. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు అని ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి కారణాలు లేకపోలేదు. మొదటిది ఆ జట్టు ఆటగాళ్ల ఫామ్‌. ప్రస్తుతం సీఎస్‌కే బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా బౌలింగ్‌లో ఆ జట్టు చాలా పటిష్టంగా ఉంది.

స్పిన్నర్లు అకీల్‌ హోసేన్‌, నూర్‌ అహ్మద్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తున్నారు. వీరిద్దరు ప్రత్యర్ది బ్యాటర్ల పాలిట కొరకరాని కొయ్యల్లా మారారు. తాజాగా ముగిసిన ఢిల్లీ మ్యాచ్‌ మినహా అన్షుల్‌ కంబోజ్‌ది కూడా ఇదే పరిస్థితి. ఇతను కూడా ప్రత్యర్ది బ్యాటర్ల పాలిట సింహస్వప్నంగా మారాడు. మరో పేసర్‌ ముకేశ్‌ చౌదరి కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. జేమీ ఓవర్టన్‌ ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు. మరో పేసర్‌ గుర్జప్నీత్‌ కూడా గత మ్యాచ్‌తో లైన్‌లోకి వచ్చాడు.

బ్యాటింగ్‌ విభాగంలో సంజూ శాంసన్‌ వారికి బ్యాక్‌ బోన్‌లా మారాడు. కెప్టెన్‌ రుతురాజ్‌ పెద్దగా ఫామ్‌లో లేకపోయినా, సంజూ ఒంటిచేత్తో బ్యాటింగ్‌ భారాన్ని మోస్తున్నాడు. అతనికి ఈ మధ్యే యువ బ్యాటర్‌ కార్తీక్‌ శర్మ తోడయ్యాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఇతగాడు జట్టు విజయాల్లో ప్రధానపాత్ర పోషించాడు. సీఎస్‌కే బ్యాటింగ్‌ను కలవరపెడుతున్నది డెవాల్డ్‌ బ్రెవిస్, ఉర్విల్‌ పటేల్‌ మాత్రమే. వీరిద్దరూ మంచి బ్యాటర్లే అయినా.. వీరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు బా​కీ ఉన్నాయి. వీరు కూడా లైన్‌లోకి వస్తే సీఎస్‌కే బ్యాటింగ్‌ విభాగం కూడా పటిష్టంగా మారుతుంది.

సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు అని చెప్పడానికి మరో కారణం ఆ జట్టు తదుపరి షెడ్యూల్‌. సీఎస్‌కే ఇకపై ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు, వరుస పరాజయాలతో ఢీలా పడిపోయిన లక్నోతో ఉన్నాయి. ప్రస్తుత జోరును కొనసాగిస్తే.. లక్నోపై రెండు మ్యాచ్‌ల్లో గెలవడం సీఎస్‌కే అంత కష్టమేమీ కాకపోవచ్చు. ఈ రెండు మ్యాచ్‌లు కూడా వరుసగా మే 15, 18 తేదీల్లో ఉన్నాయి. ఇందులో ఒకటి సొంత మైదానం చిదంబరంలో కాగా.. మరొకటి లక్నో హోం గ్రౌండ్‌లో.

మిగతా రెండు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ప్రత్యర్దులు సన్‌రైజర్స్‌, గుజరాత్‌. వీటిలో గుజరాత్‌పై విజయం సాధించినా, సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అనుకున్నట్లుగానే లక్నోపై రెండు మ్యాచ్‌లు, గుజరాత్‌పై గెలిస్తే, సన్‌రైజర్స్‌ చేతిలో ఓడినా సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. ప్రస్తుతం సీఎస్‌కే ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. లక్నో, గుజరాత్‌పై సునాయాసంగా గెలిచే ఛాన్స్‌ ఉంది.

ఈ లెక్కన ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరితే, టైటిల్‌ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement