#VijayShankar: కేకేఆర్‌ను ఎన్‌కౌంటర్‌ చేసిన విజయ్‌ శంకర్‌

Crazy-Match Winning Knock-Vijay Shankar 24 Balls-51 Runs Vs KKR - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తన హవా కొనసాగిస్తుంది. తాజాగా శనివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 14 ఓవర్ల వరకు 111 పరుగులు మాత్రమే ఉన్న గుజరాత్‌ తర్వాత మూడు ఓవర్ల వ్యవధిలోనే మ్యాచ్‌ను గెలవడం విశేషం. ఇదంతా మిల్లర్‌, విజయ్‌ శంకర్‌ల చలవే అని చెప్పొచ్చు.

14వ ఓవర్‌ వరకు మిల్లర్‌ 13, విజయ్‌ శంకర్‌ ఏడు పరుగులతో ఆడుతున్నారు. అసలు విధ్వంసం 14వ ఓవర్‌ నుంచే మొదలైంది. ఇద్దరు పోటాపోటీగా సిక్సర్లు బౌండరీలు బాదుతూ వచ్చారు. వీరిద్దరి దెబ్బకు తర్వాతి 3.5 ఓవర్లలో 79 పరుగులు వచ్చాయంటే ఎంత విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 

ముఖ్యంగా విజయ్‌ శంకర్‌ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచాడు. 24 బంతుల్లో 51 పరుగులు నాటౌట్‌గా నిలిచిన విజయ్‌ శంకర్‌ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఫోర్‌తో విధ్వంసం సృష్టించిన విజయ్‌ శంకర్‌ ఆ తర్వాత నితీశ్‌రానా వేసిన 18వ ఓవర్‌లో మరో సిక్స్‌, ఫోర్‌తో విరుచుకుపడి మ్యాచ్‌ను ముగించాడు.

మిల్లర్‌ను కూడా తక్కువ చేసి చూడలేం. నిజానికి మిల్లర్‌ 14వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది గుజరాత్‌పై ఒత్తిడి తగ్గించాడు. 18 బంతుల్లో 32 పరుగులు నాటౌట్‌గా నిలిచిన మిల్లర్‌ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మొత్తానికి ఇద్దరు కలిసి తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ను ఎన్‌కౌంట్‌ర్‌ చేశారని చెప్పొచ్చు.

చదవండి: పీసీబీ ఘనకార్యం.. క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి!

అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top