IPL 2023 GT VS KKR: Vijay Shankar Blasting 50 Made Bookies Sorrow, Check Score Details - Sakshi
Sakshi News home page

GT VS KKR: విజయ్‌ శంకర్‌ కొంపలు ముంచాడు.. లబోదిబోమనేలా చేశాడు..!

Published Sun, Apr 30 2023 11:42 AM

IPL 2023 GT VS KKR: Vijay Shankar Blasting 50 Made Bookies Sorrow - Sakshi

గుజరాత్‌ ఆల్‌రౌండర్‌, త్రీ డీ ప్లేయర్‌ విజయ్‌ శంకర్‌ బెట్టింగ్‌ రాయుళ్లను నట్టేట ముంచాడు. నిన్న (ఏప్రిల్‌ 29) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంకర హాఫ్‌సెంచరీ (24 బంతుల్లో 51 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదిన శంకర్‌, బెట్టింగ్‌ కాసే వాళ్ల కొంపలు కొల్లేరు చేశాడు. గుజరాత్‌ గెలుపుకు అడపాదడపా అవకాశాలు ఉన్న దశలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శంకర్‌.. ఎవరూ ఊహించని విధంగా రెచ్చిపోయి ఎడాపెడా సిక్సర్లు బాది, కేకేఆర్‌ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న బెట్టింగ్‌ రాయుళ్లకు దిమ్మతిరిగిపోయే షాక్‌ ఇచ్చాడు.

క్రీజ్‌లో ఉన్నది విజయ్‌ శంకరే కదా అని తక్కువ అంచనా వేసిన బెట్టింగ్ రాయుళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో నిదానంగా ఆడి బెట్టింగ్‌ కాసే వాళ్లను కేకేఆర్‌వైపు చూసేలా చేసిన శంకర్‌.. ఆతర్వాత ఒక్కసారిగా గేర్‌ మార్చి సిక్సర్ల సునామీ సృష్టించాడు. దీంట్లో ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంతో పాటు బెట్టింగ్‌ రాయుళ్లు తడిసిముద్ద అయిపోయారు. కేకేఆర్‌పై పందెం కాసి భారీగా దండుకోవచ్చని అంచనా వేసిన బెట్టింగ్‌ రాయుళ్ల ఆశలు అడియాశలయ్యాయి. విజయ్‌ శంకర్‌పై నమ్మకంతో (ఏం చేయలేడని భావించి) భారీగా బెట్టింగ్‌ కాసి, అది కాస్త బెడిసికొట్టడంతో లబోదిబోమంటున్నారు. 

180 పరుగుల లక్ష్య ఛేదనలో 14 ఓవర్ల (111/3) వరకు గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని గుజరాత్.. శంకర్‌, మిల్లర్‌ (18 బంతుల్లో 22 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఆ తర్వాత నాలుగు ఓవర్ల వ్యవధిలోనే మ్యాచ్‌ను ముగించింది. 15వ ఓవర్‌లో 18, 16లో 13, వరుణ్‌ చక్రవర్తి వేసిన 17వ ఓవర్‌లో 24, 18వ ఓవర్‌లో 14 పరుగులు సాధించి, మరో 13 బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. గుర్భాజ్‌ (81), రసెల్‌ (18) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. గిల్‌ (49), విజయ్‌ శంకర్‌ (51 నాటౌట్‌), మిల్లర్‌ (32 నాటౌట్‌) సత్తా చాటడంతో గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement