
జింబాబ్వే వెటరన్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ 39 ఏళ్ల లేటు వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అవినీతి మరియు డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఐసీసీ విధించిన మూడున్నర సంవత్సరాల బ్యాన్‌ను పూర్తి చేసుకొని జింబాబ్వే టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం జింబాబ్వే సెలెక్టర్లు టేలర్‌ను జట్టులోకి తీసుకున్నారు.
2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి 15 వేల యూస్ డాలర్లు ముడుపులు (జింబాబ్వేలో టీ20 లీగ్ లాంచ్ చేసే విషయంలో) తీసుకున్నందుకు గాను, అలాగే నిషేధిత ఉత్ప్రేరకమైన కొకైన్‌ను వాడినందుకు గాను టేలర్‌పై 2022 జనవరిలో ఐసీసీ మూడున్నరేళ్ల బ్యాన్ విధించింది. టేలర్ ఇప్పుడు ఆ బ్యాన్‌ను పూర్తి చేసుకొని త్వరలో జాతీయ జట్టుకు ఆడనున్నాడు.
టేలర్ జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించిన గొప్ప క్రికెటర్లలో ఒకరు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన అతను మూడు ఫార్మాట్లలో 9938 పరుగులు చేసి జింబాబ్వే తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. జింబాబ్వే తరఫున అత్యధిక సెంచరీలు (17) చేసిన బ్యాటర్ టేలరే కావడం విశేషం. టేలర్ తనపై బ్యాన్ విధించక ముందు ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో (టెస్ట్‌ల్లో) వరుసగా 92, 81, 49 పరుగులు స్కోర్ చేశాడు.
ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఇవాళే (జులై 30) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న జింబాబ్వే 46 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి కష్టాల్లో ఉంది. సిగా (19), క్రెయిగ్ ఎర్విన్ (31) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ 4 వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బకొట్టాడు.