భారత జట్టుకు బీసీసీఐ రూ.51 కోట్ల బహుమతి
సుదీర్ఘ సమయం కొనసాగిన వేడుకలు
ముంబై: ‘న లేగా కోయీ పంగా, కర్‌దేంగే హమ్ దంగా... రహేగా సబ్ సే ఊపర్, హమారా తిరంగా’... విశ్వ విజేతగా నిలిచిన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యుల సంబరాలు అంబరాన్నంటాయి. స్టేడియం నుంచి మొదలు పెట్టి హోటల్ గదిలో ట్రోఫీని గుండెలకు హత్తుకొని పడుకునే వరకు ప్రతీ క్షణాన్ని వారు ఆస్వాదించారు.
దక్షిణాఫ్రికా ప్లేయర్ డిక్లెర్క్ క్యాచ్‌ను అందుకోవడంతో మన శిబిరంలో షురూ అయిన వేడుకలు ఆ తర్వాత సుదీర్ఘ సమయం పాటు కొనసాగాయి. క్యాచ్ పట్టిన బంతిని అపురూపంగా దాచుకున్న కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సహచరులందరితో కలిసి ఆనందం పంచుకుంది. అక్కడే ఉన్న తన తల్లిదండ్రులను కలిసిన హర్మన్ సంతోషం రెట్టింపైంది. ఎంత ఎదిగినా నాకు పసిదానివే అన్నట్లుగా... 36 ఏళ్ల హర్మన్‌ను ఎత్తుకొని మరీ తండ్రి చూపించిన ప్రేమ హైలైట్‌గా నిలిచింది.
తన బాయ్‌ఫ్రెండ్, గాయకుడు పలాష్ ముచ్చల్‌తో స్మృతి విజయానందాన్ని ప్రదర్శించింది. భావోద్వేగానికి లోనైన జట్టు సభ్యులు పరస్పర అభినందనల తర్వాత కోలుకొని సాధారణ స్థితికి వచ్చేందుకు కొంత సమయం పట్టింది. ట్రోఫీ, పతకాల ప్రదానం వంటి లాంఛనాలు ముగిసిన తర్వాత మళ్లీ ప్లేయర్లంతా తమ ‘టీమ్ సాంగ్’తో ఒక్క చోటికి చేరారు.
పిచ్‌పై ట్రోఫీని ఉంచి ‘టీమిండియా, టీమిండియా... హియర్ టు ఫైట్, కోయీ న లేతా హమ్‌కో లైట్’... అంటూ సాగిన ఈ పాటను అందరూ కలిసి పాడారు. దీనికి సంబంధించి ఆసక్తికర నేపథ్యాన్ని జెమీమా వెల్లడించింది. నాలుగేళ్ల క్రితమే తమ జట్టుకు థీమ్ సాంగ్ కావాలని భావించామని... అయితే ప్రపంచకప్ గెలిచిన తర్వాత దీని గురించి చెప్పాలనే అంతా నిర్ణయించుకున్నామని ఆమె పేర్కొంది.
ఇప్పుడు దానికి సరైన సమయం వచి్చందంటూ జెమీమా పాటను మొదలుపెట్టింది. జట్టు సభ్యులు స్టేడియం నుంచి హోటల్‌కు చేరుకున్న సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఢోల్ బాజాలతో వారికి స్వాగతం లభించింది. హర్మన్ స్వయంగా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ చేతిలో పట్టుకొని పంజాబీ పాటలకు డ్యాన్స్ చేస్తూ ముందుకు సాగడం విశేషం. జెమీమా, స్మృతి ట్రోఫీతో కలిసి పడుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి.
బోర్డు కానుకతో పాటు...
తొలిసారి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న భారత బృందానికి బీసీసీఐ సముచిత రీతిలో బహుమతిని ప్రకటించింది. టీమిండియా జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీకి కలిపి మొత్తం రూ.51 కోట్లు నజరానాగా ఇస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. విడివిడిగా ఎంత మొత్తం అనే విషయంలో స్పష్టత లేకపోయినా... ప్లేయర్లకు ఒక్కొక్కరికి కనీసం రూ. 2 కోట్ల 50 లక్షలు దక్కే అవకాశం ఉంది.
జట్టులో ప్రధాన పేసర్లయిన రేణుకా సింగ్, క్రాంతి గౌడ్‌లకు వారి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాన్ని ప్రకటించాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రాంతి గౌడ్‌కు, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రేణుకకు రూ. 1 కోటి చొప్పున ఇవ్వనున్నాయి. మరోవైపు సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ ఢోలకియా కూడా తన తరఫు నుంచి భారత జట్టు సభ్యులకు వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు.
సీనియర్లకు గౌరవంతో...
భారత జట్టు తొలిసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. కానీ ప్రస్తుత టీమ్ ఈ స్థాయికి చేరడంలో తమ వంతు పాత్ర పోషించిన సీనియర్లు, గతంలో తమ సహచరులను ఆటగాళ్లు మర్చిపోలేదు. 2005, 2017 రన్నరప్‌గా నిలిచిన జట్లకు కెప్టెన్‌గా ఉండటంతో పాటు మొత్తం ఆరు వరల్డ్ కప్‌లు ఆడినా ట్రోఫీని ముద్దాడలేకపోయిన మిథాలీ రాజ్‌తో పాటు మరో దిగ్గజం జులన్ గోస్వామిలను భారత జట్టు సభ్యులు తమ వేడుకల్లో భాగం చేశారు. మరో మాజీ ప్లేయర్, టీవీ వ్యాఖ్యాత అంజుమ్ చోప్రా కూడా వీరితో జత కలిసింది. మిథాలీ చేతికి ట్రోఫీని అందించగా, దానిని అందుకొని ఆమె కొద్ది సేపు భావోద్వేగానికి గురైంది. ఈ టీమ్‌లో చాలా మంది మిథాలీ నాయకత్వంలో ఆడినవారే ఉన్నారు.


