సాక్షి, సిద్దిపేట: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 20 రోజుల నుంచే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి పడిగాపులు కాస్తున్నారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఽవాతావరణ మార్పులతో వర్షాలు కురవచ్చన్న బెంగ రైతుల్లో నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా 3.73లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 421 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,100 మంది రైతుల నుంచి 25,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకపోయాయి. ఇప్పటి వరకు రూ.30 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా.. రూ.6.44కోట్లను మాత్రమే రైతులకు చెల్లించారు. ఇంకా దాదాపు రూ.13.56కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
కొంత మేరకు తాలుతోనే ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్యాడి క్లీనర్ల ద్వారా ఎంత జల్లి పట్టినా అలాగే ఉంటుందని, పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఽకూలీల కొరతతో జల్లి పట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు హమాలీలు, లారీల కొరత తో సైతం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి.
18 రోజులుగా పడిగాపులు
ధాన్యం అమ్మేందుకు
కర్షకుడి కష్టాలు
కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు
పలుచోట్ల రోడ్డెక్కుతున్న రైతులు
చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
ఇప్పటి వరకు కొనుగోలు చేసింది
25వేల మెట్రిక్ టన్నులే..
ధాన్యం రాశులు ఉన్న ఈ దృశ్యం.. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం. ఏప్రిల్ 24న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇప్పటికీ తొమ్మిది రోజులవుతున్నా ఒక్క గింజనూ కొనుగోలు చేయలేదు. 60 మందికి పైగా రైతులుకొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఉంచారు. దాదాపు 300 టన్నుల ధాన్యం రాశులు పేరుకపోయాయి. అకాల వర్షాలు కురిస్తే అంతా ఆగమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాలు పేరుతో కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
20 రోజులవుతున్నా కొంటలేరు
దుబ్బాక మార్కెట్ యార్డులో వడ్లు పోసి 20 రోజులవుతోంది. వడ్లు ఎండి 12 శాతం తేమ వస్తోంది. అయినా కాంటా పెట్టడం లేదు. బి గ్రేడ్ అయితేనే కొంటామంటూ అధికారులు చెబుతున్నారు. ఎండల్లో నానాపాట్లు పడుతున్నాం. అధికారులు వెంటనే కొనుగోలు చేయాలి.
– వంగ శ్రీనివాస్‌రెడ్డి, చెల్లాపూర్


