సిద్దిపేటకమాన్: మధ్యవర్తిత్వంతో ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా తెలిపారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో 30మంది న్యాయవాదులకు 40గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి నందా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 684 మంది అడ్వకేట్లకు ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మీడియేషన్ ద్వారా ఆస్తి వివాదాలు తదితర కేసుల్లో సత్వరం న్యాయం అందుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసులను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మెంబర్ పంచాక్షరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్‌కుమార్, సాధన, తరణి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న సన్నిధిలో
చేర్యాల జడ్జి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని చేర్యాల జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు నీల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లమ్మ తల్లికి సీపీ పూజలు
హుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ జాతర కొనసాగుతోంది. శనివారం సీపీ రష్మీ పెరుమాళ్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తాటికొండ పరమేశ్వర్ శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కుంకుమార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, అమ్మవారి విశిష్టత, జాతర కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ లక్ష్మారెడ్డిలు ఉన్నారు.
అర్హులందరికీ
సంక్షేమ ఫలాలు
జెడ్పీ సీఈఓ రమేశ్
దుబ్బాక: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజాపాలన లక్ష్యమని జెడ్పీ సీఈఓ,స్పెషల్ ఆఫీసర్ రమేశ్ అన్నారు. శనివారం దుబ్బాక పట్టణంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మండల మహిళా సమాఖ్యలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.194.89 కోట్ల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలన అందించేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ రవీందర్, ఏఎంసీ చైర్మన్లు కొంగరి రవి, సంయుక్త, ఎంపీడీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


