● త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తాం ● కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు కృషి ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి నిర్మాణం తనదే బాధ్యత అని, భూ నిర్వాసితులకు త్వరలో పేమెంట్ చేసి కాలువల నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పట్టణంలో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ రామ్మూర్తి ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారు. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వినిపించారు. అంతకముందు మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ హైమావతితో కలిసి పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలకు రూ.128 కోట్ల విలువైన బ్యాంక్ లింకేజీ చెక్కులు, కల్యాణలక్ష్మి, నేతన్న బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ జూన్ 2 తర్వాత పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లు ఇస్తామన్నారు. కొత్తపల్లి నుంచి హుస్నాబాద్‌కు నాలుగు వరుసల రహదారి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. హుస్నాబాద్‌లో హోల్‌సెల్ కూరగాయల ఏర్పాటు చేస్తామని, త్వరలో కబడ్డి అకాడమీ సైతం ఏర్పాటు కాబోతుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీ సాధన రష్మీ పెరుమాళ్, మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


