దుబ్బాకలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

దుబ్బాకలో ఉద్రిక్తత

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫైర్‌

‘ప్రజాపాలన’ సభలో

కింద కూర్చొని నిరసన

దుబ్బాక: పట్టణంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై కింద కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశంలోకి దూసుకొచ్చారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. ఎమ్మెల్యే నిరసన తెలుపుతూ మాట్లాడుతుండగా మైక్‌లు కట్‌ అయ్యాయి. రైతుల గురించి మాట్లాడుతుంటే కట్‌ చేస్తారా అంటూ ఆగ్రహంతో మైక్‌ను నేలకేసికొట్టారు. అనంతరం సభను బహిష్కరించి ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి బయటకొచ్చి గేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రైతులు కష్టాలు పడుతుంటే సంబరాలా?

ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్లపై ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజాపాలన సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేయడం కాదని, రైతుల మధ్యకొస్తే పరిస్థితి తెలుస్తుందన్నారు. బీ గ్రేడ్‌ ధాన్యం కొంటామంటూ అధికారులు షరతులు పెట్టడం సరికాదన్నారు. వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. చివరి గింజకొనే వరకు రైతులకు అండగా ఉండి పోరాడుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement