సిద్దిపేటరూరల్: ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. శనివారం మండల పరిధిలోని రాఘవాపూర్ వద్ద సిద్దిపేట– కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారం రోజులవుతున్నా నేటికీ ధాన్యం కొంటలేరని మండిపడ్డారు. పంటలు కోసి నెల రోజులు దాటుతున్నా కొనుగోళ్లు సాగడం లేదన్నారు. తాలు పట్టే ప్రక్రియలో జల్లి యంత్రాలు సరిగ్గా లేవని దీంతో సమయం వృథా అవుతోందన్నారు. తాలు పట్టే విధానం కాకుండా పాతపద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలన్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ శ్రీను, ఎస్‌ఐ రాజేష్‌లు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ రావాలంటూ రైతులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తహసీల్దార్ రెహమాన్ కు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్నారు. రెండురోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సర్పంచులు పద్మ శ్రీనివాస్, భాస్కర్‌రెడ్డి, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.


