పచ్చని అందాలు మహబూబ్ సాగర్ చెరువు కింద వరి పొలాలన్నీ పచ్చని తివాచీలాదర్శనమిస్తున్నాయి. వివరాలు IIలో u
జిల్లా కాంగ్రెస్ కమిటీ పూర్తి కార్యవర్గం ఎప్పుడు ప్రకటిస్తారని పార్టీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 డీసీసీ పూర్తిస్థాయి కమిటీలను నియమించింది. సిద్దిపేటను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. కార్యవర్గం ఏర్పాటు కోసం నేతల మధ్య సమన్వయం కుదరపోవడమే కారణమని ఆ పార్టీ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు.
– సాక్షి, సిద్దిపేట
గతేడాది నవంబర్ 22న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తూంకుంట ఆంక్షారెడ్డిని అధిష్టానం నియమించిన విషయం తెలిందే. గత నాలుగు నెలలుగా అధ్యక్షురాలు ఒక్కరే కొనసాగుతున్నారు. డీసీసీ పూర్తి స్థాయి కమిటీ కోసం టీపీసీసీ నుంచి మల్లాది పవన్, రోహిత్‌రావులను నియమించారు. కార్యవర్గం నియామకం కోసం నియోజకవర్గ ముఖ్యనేతలతో వారు సమావేశాలు నిర్వహించారు. అయితే నియోజకవర్గ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోనే డీసీసీ కమిటీని ప్రకటించలేదని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తోడుగా గట్టి టీం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేతలు తమ అనుచరులకు పార్టీ పదవులు ఇప్పించుకోవాలని పోటీ పడుతున్నారు.
పోటీ ఎక్కువే..
కాంగ్రెస్‌లో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తాయనే సంకేతాలతో వీటిని దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. డీసీసీ కమిటీ, మండల, బ్లాక్ కమిటీలే ఇక పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తాయని సంకేతాలివ్వడంతో పదవులను దక్కించుకునేందుకు నేతల్లో పోటీ మొదలైంది. ఒక్కో బ్లాక్‌కు ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధి ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కార్యవర్గ సభ్యులను దాదాపు 15 మంది వరకు నియమించనున్నారు. దీంతో ఇప్పటికే మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పలువురు నేతలు డీసీసీలో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలువురు రాష్ట్ర నాయకులు నేతల పేర్లను సైతం సిఫార్సు చేసినట్లు సమాచారం.
ఆశగా ఎదురుచూపులు
కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో జిల్లా పదవుల కోసం పలువురు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ పదవి ఉంటే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ల ఎంపికలో కీలక పాత్ర పోషించవచ్చని, దీంతో పదవిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయ త్నాలు చేస్తున్నారు.


