కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: అధికారికంగా దత్తత తీసుకున్న దంపతులు పిల్లల బంగారు భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 4 సంవత్సరాల బాబును ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దంపతులకు, 6 నెలల ఆడశిశువును నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించాలని, వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలన్నారు. పిల్లలను భవిష్యత్ నిర్మాణ పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాలో పిల్లలు లేని దంపతులు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే సిద్దిపేట శిశుగృహ, బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తద్వారా న్యాయపరమైన ఇబ్బందులు ఉండవన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారధ, బాలరక్షాభవన్ కోఆర్డినేటర్ మమత, డీసీపీఓ రాము, శిశు గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కవిత, కాంగ్రెస్ ఒకటే: ఎంపీ రఘునందన్
సంగారెడ్డి: కవిత కాంగ్రెస్ ఒకటేనని, ఆమె నూతన పార్టీ ఏర్పాటు చేస్తారని తాను ఏడాది క్రితమే చెప్పానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్ నాలుగు ముక్కలు అవుతుందని తాను అప్పుడే జోస్యం చెప్పానన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ కనుమరుగవుతుందని, కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు.


