అనుసంధానం ఇంకెన్నేళ్లు? | - | Sakshi
Sakshi News home page

అనుసంధానం ఇంకెన్నేళ్లు?

Mar 28 2026 10:36 AM | Updated on Mar 28 2026 10:36 AM

పెండింగ్‌ పని వల్ల పూర్తిస్థాయిలో గజ్వేల్‌ రింగు రోడ్డు వినియోగంలోకి రాక.. ట్రాఫిక్‌ సమస్యలు పెరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల కిత్రం ఈ రోడ్డుపై జాలిగామ–ధర్మారెడ్డిపల్లి గ్రామాల 1.6కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉన్న మధ్య రైల్వే బ్రిడ్డి కూడా పూర్తయ్యింది. ఇక మిగిలింది సంగాపూర్‌ రోడ్డుపై సిటిజన్స్‌ క్లబ్‌ భవనం వల్ల కేవలం 150మీటర్లే పెండింగ్‌ మాత్రమే. ఇక్కడ భూసేకరణ వ్యవహారం కోర్టుకెళ్లడమే కారణం. దీనిపై చొరవ తీసుకొని తగు పరిష్కారం చూపగలిగితేనే రింగు రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ వ్యవహారంపై కొన్ని రోజుల కిందట అసెంబ్లీలో ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావుల మధ్య చర్చ జరిగింది. అంతేకాకుండా ఈనెల 22న జిల్లాలోని నంగునూరు మండల నర్మేటలో నిర్మించిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు రింగు రోడ్డు అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ స్పందన కోసం ఇక్కడ ప్రజలు ఎదురుచూపుల్లో ఉన్నారు.

తరచూ

చర్చనీయాంశం..

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీకి కంఠహారంగా నిర్మించిన ‘రింగు రోడ్డు’ అంశం తరుచూ వార్తల్లోకెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చకు దారితీస్తోంది. రూ.233కోట్ల వ్యయంతో ఈ రింగ్‌ రోడ్డు నిర్మించి పదేళ్లు కావొస్తోంది. అయినా కేవలం 150మీటర్ల పని పెండింగ్‌ వల్ల పూర్తిస్థాయి అనుసంధానానికి నోచుకోవడంలేదు. అసెంబ్లీలోనే కాదు.. ఈనెల 22న జిల్లాలో జరిగిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ దృష్టికి సైతం ఈ అంశం వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్పందనపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది.

– గజ్వేల్‌

మాజీ సీఎం కేసీఆర్‌ చొరవ ఫలితంగా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ రింగు రోడ్డు మంజూరైంది. 23కిలోమీటర్ల మేర 2015లో పనులు మొదలయ్యాయి. ఆగుతూ... సాగిన ఈ పనుల నిర్మాణ వ్యయం రూ.233కోట్లకు చేరింది. పనులు వందశాతం పూర్తికాకుండానే 2023 అక్టోబర్‌లో అధికారికంగా ప్రారంభించారు. ఈ రింగు రోడ్డు రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దారు. ఒక పట్టణ అవసరాలకు రింగు రోడ్డు నిర్మించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఈ రోడ్డుకు అంతర్జాతీయ ప్రమాణాలద్దారు. రింగు రోడ్డుకు అనుసంధానంగా మరో నాలుగు రేడియల్‌ రోడ్లు 12.5కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. మరెన్నో ప్రత్యేకతలను ఈ రోడ్డు సొంతం చేసుకున్నది. మొత్తం 12 సర్కిళ్లతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. రింగు రోడ్డు నిర్మాణం వల్ల గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ చుట్టూ ఉన్న రోడ్డుకు వెలుపలు, బయట భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఈ రోడ్డును ఆనుకొని విల్లాలు, అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోడ్డు కేవలం 150మీటర్ల పనుల పెండింగ్‌ వల్ల పదేళ్లుగా వందశాతం అనుసంధానానికి నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.

గజ్వేల్‌ రింగ్‌ రోడ్డుకు పదేళ్లు..

23కిలోమీటర్ల మేర

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం

రూ.233కోట్లతో సాగిన పనులు

సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వ్యవహారం

ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement