దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి (సీఎంఓఎస్‌ఎస్) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సు విద్యను అభ్యసిస్తున్న మైనార్టీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు జనవరి 19 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
జాన్ విల్సన్ ఆదర్శనీయుడు
ఏసీపీ సదానందం
హుస్నాబాద్: పోలీస్ విధి నిర్వహణలో నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు ప్రాణాలు కోల్పోయిన ఎస్సై జాన్ విల్సన్‌ను పోలీసులు ఆదర్శంగా తీసుకోవాలని ఏసీపీ సదానందం అన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై జాన్ విల్సన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ 34 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉండేదన్నారు. అలాంటి పరిస్థితిలో జాన్ విల్సన్ మందుపాతరకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజల మనస్సులో జాన్ విల్సన్ చిరస్థాయిగా నిలువడం పోలీస్ శాఖకే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఎస్సై లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జాన్ విల్సన్ ట్రస్ట్ చైర్మన్ బోయిని ఎల్లయ్య, పోలీస్ సిబ్బంది, ప్రముఖులు పాల్గొన్నారు.
స్వచ్ఛ పథకానికి
జెడ్పీ బాలుర పాఠశాల
దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల స్వచ్ఛ విద్యాలయ పథకానికి ఎంపిక కావడం అభినందనీయమని మండల విద్యాధికారి కనకరాజు అన్నారు. స్వచ్ఛ విద్యాలయ పరిశీలనలో భాగంగా రాష్ట్ర బృందం పాఠశాలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల మౌలిక వసతులు, పరిశుభ్రతను స్వచ్ఛ విద్యాలయ పథకంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.
ప్రజల ఆదరణ మరువలేనిది
ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి
ములుగు(గజ్వేల్): బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజల ఆదరణ మరువలేనిదని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, ములుగు పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి అన్నారు. నూతన సర్పంచ్ తిగుళ్ల కనుకయ్య, ఉపసర్పంచ్ కర్ణాకర్‌రెడ్డి, వార్డు సభ్యులను శుక్రవారం ఆయన అభినందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములుగు ప్రజలు మూడవసారి బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థికి పట్టం కట్టడం అభినందనీయమన్నారు. ప్రజల నమ్మకాన్ని కాదనకుండా నూతన సర్పంచ్‌లు అభివృద్ది, సంక్షేమ పథకాలను చేపట్టి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
23న క్రాస్ కంట్రీ
ఎంపిక పోటీలు
సిద్దిపేటజోన్: స్థానిక స్టేడియంలో ఈనెల 23న జిల్లా క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి వెంకట్ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 22 సాయంత్రంలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పురుషులకు 10కిలోమీటర్లు, మహిళలకు 8 కిలోమీటర్లు, అండర్ 20 బాలురకు 8కిలోమీటర్లు, అండర్ 18 బాలురకు 6 కిలోమీటరు పరుగు పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం


