డాక్టర్లు ఉండరు.. మందులు ఉండవు
సిద్దిపేటకమాన్: పట్టణంలో ఉన్న నాలుగు బస్తీ దవాఖానాల్లో మూడింటిలో డాక్టర్లు లేరని.. డాక్టర్ కుర్చీకి దుమ్ము పట్టిందని.. బస్తీ దవాఖానాలకే సుస్తి తెచ్చిన ప్రభుత్వమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను హరీశ్‌రావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కేసీఆర్‌నగర్, కాళ్లకుంట కాలనీ, లింగారెడ్డిపల్లి, ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద నాల్గు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు బస్తీ దవాఖానాల్లో ఆరు నెలలుగా డాక్టర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్ రూమ్ పెచ్చులు ఊడిపోయి, డాక్టర్ కుర్చీ దుమ్ము పట్టి ఉండటంపై ఇదేనా బస్తీ దవాఖాన తీరని, డాక్టర్ లేకుండా వైద్యం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. జలుబు, షుగర్, విరేచనాలకు సంబంధించిన మాత్రలు సైతం లేవన్నారు. ప్రజా వైద్యంపై నిర్లక్ష్యం వీడాలని, వెంటనే బస్తీ దవాఖానలో వైద్యులను ఏర్పా టు చేసి సకాలంలో మందులు అందుబాటులో ఉంచాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
బస్తీ దవాఖానాలకే సుస్తి తెచ్చిన సర్కార్
మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్


