రెండో విడత.. పోరు
సర్వం సిద్ధం.. కట్టుదిట్టం ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 172 సర్పంచ్ స్థానాలకు బరిలో 684 మంది.. 1,371 వార్డులకు 3,644 మంది పోటీ
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం 172 సర్పంచ్, 1,371 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ నిర్వహణతోపాటు
కౌంటింగ్ కోసం 4,763 మంది సిబ్బందిని నియమించారు. రెండో విడతలో 38 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. రెండో విడతలో 4,328 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి పర్యవేక్షించారు. – సాక్షి, సిద్దిపేట
జిల్లాలో మూడు విడతలలో 508 సర్పంచ్‌లు, 4,508 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మొదటి విడత ఈ నెల 11న ముగియగా, ఆదివారం రెండో విడతలో 10 మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో 182 సర్పంచ్‌లు, 1,644 వార్డులకు గాను 10 సర్పంచ్‌లు, 273 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 172 సర్పంచ్ స్థానాలకు 684 మంది, 1,371 వార్డు స్థానాలకు 3,644 మంది పోటీ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఓటర్లకు డబ్బులు, మద్యం, వివిధ రకాల గిఫ్ట్‌లను అందజేసినట్లు తెలిసింది.
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
పది మండలాల్లో పది చోట్ల ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లు, పేపర్లు, ఇతర మెటీరియల్‌ను పంపిణీ చేశారు. అక్బర్‌పేట – భూంపల్లిలో శ్రీనివాస ఐటీఐ, చిన్నకోడూరులో ఎంపీడీఓ కార్యాలయం, దుబ్బాకలో ఎంపీడీఓ కార్యాలయం, మిరుదొడ్డిలో మోడల్ స్కూల్, నంగునూరులో ఎంపీడీఓ కార్యాలయం, నారాయణరావు పేటలో జెడ్పీహెచ్‌ఎస్, సిద్దిపేట రూరల్‌లో మైనార్టీ కాలేజీ, సిద్దిపేట అర్బన్‌లో మెరీడియన్ స్కూల్, తొగుటలో ఎంపీడీఓ కార్యాలయం, బెజ్జంకిలో శ్రీసత్యసాయి గురుకుల విద్యానికేతన్‌లో పోలింగ్ సామగ్రిని అందజేశారు. ఆయా కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
మొదట వార్డు ఓట్ల లెక్కింపు
బ్యాలెట్ బాక్స్‌లో సర్పంచ్ ఓట్లను వేరు చేస్తూనే.. తొలుత వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. పంచాయతీ చివరి వార్డు ఫలితం వెల్లడించాక.. సర్పంచ్ ఓట్లను గుర్తుల వారీగా వేరు చేసి లెక్కిస్తారు. చిన్న గ్రామ పంచాయతీలు సాయంత్రం 5గంటలలోగా ఫలితాలు వెల్లడికానున్నాయి. పెద్ద గ్రామ పంచాయతీల ఫలితాలు రాత్రి 7గంటల తర్వాతే వచ్చే అవకాశం ఉంది.
విధుల్లో 4 వేల మంది..
ఎన్నికల నిర్వహణకు 4,763 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ అధికారులు1,973, పోలింగ్ సిబ్బంది 2,436 మందిని నియమించగా ప్రత్యేక వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించారు.


