ఇవేం ఏర్పాట్లు
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
బెజ్జంకి(సిద్దిపేట): ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాట్లపై కలెక్టర్ హైమావతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెజ్జంకిలోని సత్యసాయి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి పరిశీలించారు. భోజన, తదితర వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంటర్‌లోని మైక్ పని చేయకపోవడంతో ఎంపీడీఓ ప్రవీణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే విధులు నిర్వహించడం కష్టమని, బెజ్జంకి కేంద్రంపై దృష్టి సారించాలని ఆర్‌డీఓకు సూచించారు. ఎన్నికల విధులకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కావాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రాత్రి వేళ సంబంధిత పోలింగ్ కేంద్రాలలో భోజనవసతి కల్పించాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కు మరవొద్దు
సిద్దిపేటరూరల్: ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలని, ఓటు హక్కు మరవద్దని కలెక్టర్ హైమావతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ అవకాశాన్ని ఆయా మండలాల్లోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, జెడ్పీ సీఈఓ రమేశ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.


