హోరాహోరీగా సంగ్రామం
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గుర్తుల కేటాయింపుతో ప్రచార ప్రణాళికలను రూపొందించుకున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 163 సర్పంచ్, 1,432 వార్డు స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో జరిగే వాటిలో 16 సర్పంచ్‌లు, 224 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 147 సర్పంచ్‌లకు గాను 497 మంది అభ్యర్థులు, 1,208 వార్డు సభ్యులకు 3,196 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
– సాక్షి, సిద్దిపేట
మొదటి విడత జరిగే ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏడు మండలాల్లోని.. మూడు గ్రామ పంచాయతీలలో పోటీ తీవ్రంగా ఉంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 8 మంది చొప్పున బరిలో నిలిచారు. ములుగు మండలం కొత్తూరు, మునిగడప(జగదేవ్‌పూర్), సూరంపల్లి(దౌల్తాబాద్)లో అత్యధికంగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వర్గల్ మండలం మాదారంలో ఏడుగురు, గజ్వేల్ మండలం బేజుగాం, రాయపోలులో ఆరుగురు, కాశిరెడ్డిపల్లి(మర్కూక్)లో ఐదుగురు సర్పంచ్‌కు పోటీ చేస్తున్నారు. మిగతా చోట్ల ఐదు కంటే తక్కువ మంది పోటీలో ఉన్నారు. ఎక్కువగా త్రిముఖ పోటీ ఉంది.
ప్రత్యేకంగా పాటల రూపకల్పన
సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా పాటలను తయారు చేసుకుని ప్రచారం ప్రారంభించారు. అలాగే కరపత్రాలు, వాల్ పోస్టర్లను వినియోగిస్తున్నారు. కేటాయించిన గుర్తులతో సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి బంధువులు, స్నేహితులు వారి వారికి తెలిసిన వాళ్లకు ఫోన్‌లు చేసి ‘గుర్తు’ంచుకోండి..’ అంటూ చెబుతున్నారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండటంతో 9వ తేదీతో ప్రచారం ముగియనుంది. సమయం తక్కువగా ఉండటంతో ప్రచార వేగం పెంచారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కొందరు సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల అవసరాల కోసం ముందస్తుగానే భారీగా డబ్బులు, మధ్యాన్ని సమకూర్చుకున్నట్లు సమాచారం.
ప్రచారం.. ముమ్మరం
తొలివిడతలో 147 సర్పంచ్‌లు,1,208 వార్డులకు ఎన్నికలు
అదృష్టాన్ని పరీక్షించుకోనున్న1,705 మంది అభ్యర్థులు
మూడు చోట్ల.. 8 మంది చొప్పున పోటీ
‘గుర్తు’ంచుకోండి.. అంటూ అభ్యర్థుల విన్నపాలు
మొదటి విడతలో 16 సర్పంచ్‌లు,224 వార్డు సభ్యులు ఏకగ్రీవం
13 జీపీలలో మొత్తం ఏకగ్రీవం
మొదటి విడతలో జరిగే 13 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లింగాయపల్లి తండా, నర్సంపల్లి(దౌల్తాబాద్), రంగంపేట(గజ్వేల్), నిర్మల్‌నగర్, బీజీ వెంకటాపూర్, పలుగుగడ్డ, అనంతసాగర్, కొండాపూర్ (జగదేవ్‌పూర్), ఎర్రవల్లి(మర్కూక్), ఆరేపల్లి (రాయపోల్), చాంద్‌కాన్‌మక్తా, గుంటిపల్లి, తునికిమక్తా(వర్గల్) గ్రామాల్లో అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.


