న్యాయం చేయకుంటే ఓట్లు వెయ్యం
సిద్దిపేటరూరల్: తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎన్నికల్లో ఓట్లు వేసే ప్రసక్తే లేదని ఇబ్రహీంపూర్ గ్రామ ఎస్సీ కులస్తులు నిరసన తెలిపారు. గురువారం నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌లో ఎస్సీ కులస్తులు విలేకరులతో మాట్లాడుతూ బీసీ దాసరి కులానికి చెందిన కొందరు వ్యక్తులు తప్పుడు ఆధారాలు చూపి ఎస్సీ వర్గానికి చెందిన వారీగా కుల ధ్రువీకరణ పత్రాలు పొందారు. గతంలో వారిని బీసీగా పరిగణించి వార్డు స్థానాలకు పోటీ చేశారు. కానీ ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో రిజర్వేషన్ల వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారన్నారు. అర్హులైన మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వినియోగించుకోకుండా బీసీ కులానికి చెందిన వ్యక్తులు నామినేషన్ వేయడం సరికాదని, ఈ విషయంపై ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందన లేదన్నారు. సమస్య పరిష్కరించకపోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ వర్గం ఓట్లు బహిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సుమన్, మాజీ సర్పంచ్ దేవయ్య, కనకయ్య, నర్సింహులు, చిన్న దేవయ్య, లక్ష్మి, సాయవ్వ, పుష్పలత, లత,ఎల్లవ్వ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు ఎస్సీ సర్టిఫికెట్‌తో నామినేషన్
విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి
ఇబ్రహీంపూర్‌లో ఎస్సీ కుల సభ్యుల నిరసన


