కుల సంఘాలకు తాయిలాల ఎర
జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. నామినేషన్‌ల ఉసంహరణ తర్వాత దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లోని 163 సర్పంచ్ పదవులకుగానూ 480మంది బరిలో ఉన్నారు. 1,432 వార్డు సభ్యుల పదవుల కోసం.. 2,797మంది పోటీలో ఉన్న సంగతి తెల్సిందే. ఎన్నికల రంగంలో తమ సత్తాను నిరూపించుకోవడానికి సిద్ధమైన వీరంతా ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలోనే గెలుపు కోసం అనువైన మార్గాలపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో గెలుపోటములను ప్రభావితం చేసేదీ కుల సంఘాలే. ఈ క్రమంలో సంఘాలకు చెందిన పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. కొందరైతే భారీగా నజరానాలను ప్రకటించి అందజేస్తున్నారు. ప్రధానంగా కుల సంఘాలకు చెందిన ఆలయాలకు పెద్ద మొత్తంలో విరాళాలను అందజేస్తున్నారు. అంతేకాకుండా వంట, టెంట్ సామగ్రిని సైతం అందజేస్తున్నారు. ఇవేకాకుండా కుల సంఘాల్లోని సభ్యుల లెక్క మేరకు ఒక్కొక్కరికీ కొంత నగదును ముట్టజెప్పుతున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ఈ తంతూ చాలా వేగంగా సాగుతోంది. ములుగు, వర్గల్, మర్కూక్, గజ్వేల్ మండలాల్లో తాయిలాల ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. ఓ అభ్యర్థి తన గ్రామంలో ఓ సంఘానికి అత్యధికంగా రూ.10లక్షల వరకు ముట్టజెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది.
భిన్నంగా ప్రచార పర్వం..
పంచాయతీ ఎన్నికల్లో ప్రచార పర్వం భిన్నంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీల కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఉండటం వల్ల మెజార్టీ అభ్యర్థులు తమ వ్యక్తిగత ప్రచారంతోనే ముందుకుసాగుతున్నారు. కొందరు మందీమార్బలంతో హడావిడి చేస్తుండగా, చాలామంది ఒక్కరుగా రాత్రి, తెల్లవారుజాముల్లో ఓటర్లను ఇళ్ల వద్దకు వెళ్లి తమకు ఓటు వేయాలని మాట తీసుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియా ప్రచారానికే ప్రాధాన్యతనిస్తున్నట్లు కనపడుతోంది. వాట్సాప్ సందేశాలు, టెక్ట్స్ మేసేజ్‌లు, ఫెస్‌బుక్, ఇన్‌స్టా ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. మరోముఖ్యమైన అంశమేమీటంటే జానపద బాణీల్లో పాటలు తయారు చేయించి మైక్ ప్రచారాన్ని విస్త్రతంగా నిర్వహిస్తున్నారు.
సోషల్ మీడియాలో జోరుగా చర్చ
ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది? అనే అంశంపై గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో చర్చలను లేవదీస్తున్నారు. ఈ చర్చల్లో యువత పాల్గొంటున్నారు. కానీ చర్చలు వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు దారితీస్తుండగా.. ఘర్షణ వాతావరణం నెలకొంటున్నది. చాలా గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితికి అడ్డుకట్టవేయడానికి పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
భారీగా ఆఫర్లు చేస్తున్న అభ్యర్థులు
ఆలయాలకు విరాళాలు, వంట,టెంట్ సామగ్రి తదితరాల అప్పగింత
రసకందాయంలో ‘పంచాయతీ’ పోరు


