పత్తి రైతు పరేషాన్
రేపటి నుంచి కొనుగోళ్లు బంద్
● సీసీఐ నిబంధనలకు నిరసనగా వ్యాపారుల నిర్ణయం
● తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్‌కు విక్రయిస్తున్న రైతులు
● అందినకాడికి దోచుకుంటున్న దళారులు
● అధికారుల పర్యవేక్షణ కరువు
కొండపాకలోని ఓ మిల్లు వేబ్రిడ్జిలో కాంటా పెడుతున్న పత్తి వాహనం
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిబంధనలకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని ఈ నెల17 నుంచి కొనుగోళ్లు బంద్ చేస్తామని వ్యాపారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో డబ్బులు అత్యవసరం ఉన్న రైతులు చేసేదిలేక ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. దీంతో దళారులు దోపిడీకి తెరతీస్తున్నారు. క్వింటాలు పత్తికి రూ.6,100 నుంచి రూ.6,600లకు కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ చెల్లించే దానికంటే ఒక్కో క్వింటాలుకు రూ.1,500 నుంచి రూ.2వేల వరకు రైతులు నష్టపోతున్నారు.
– సాక్షి, సిద్దిపేట:
సీసీఐ ఆధ్వర్యంలో జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఇప్పటి వరకు 17 మిల్లుల్లోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 8శాతం తేమ ఉండి గింజ పొడవును మేరకు రూ.8,010 నుంచి రూ.8,110 వరకు, 9 శాతం తేమ ఉంటే రూ.7,979 నుంచి రూ.8,028, 10 నుంచి 12శాతం వరకు తేమ ఉంటే రూ.7,689 నుంచి 7,947 వరకు సీసీఐ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు సీసీఐ వారు 4,822 మంది రైతుల నుంచి 5,438 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు.
సీసీఐ కొనుగోళ్లను బంద్ చేస్తామని జిన్నింగ్ మిల్లుల యజమానులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెంపిన పత్తి ఇంట్లో నిల్వపెట్టడం ఇబ్బంది అని, మరోవైపు ప్రైవేట్ వారు ధరను ఇంకా తగ్గిస్తారని భావించి వచ్చిన కాడికి అమ్మేస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యాపారులు 5,066 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేయడం గమనార్హం.
ఇప్పటికే అకాల వర్షాలు, అనుకూలించని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి పత్తి దిగుబడులు ఆశించినంతగా రావడం లేదు. పెట్టిన పెట్టుబడులు రాలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జిన్నింగ్ మిల్లుల యజమానుల దోపిడీకి అడ్డు లేకుండా పోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని పలువురు రైతన్నలు కోరుతున్నారు.
రోజంతా ఆరబెట్టినా..
రోజంతా ఎండలో ఆరబెట్టి సీసీఐ కేంద్రానికి తీసుకవచ్చి లైన్‌లో ఉంచితే.. రాత్రి, ఉదయం వేళల్లో కురుస్తున్న మంచుతో పత్తిలో తేమ శాతం పెరుగుతోంది. దీంతో సీసీఐ నిర్ణయించిన తేమ శాతం రాకపోవడంతో ఆ పత్తిని రిజక్ట్ చేస్తున్నారు. దీంతో వెంటనే ప్రైవేట్ వ్యాపారి ఆ పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మళ్లీ అదే పత్తిని మధ్యాహ్నం తర్వాత అదే సీసీఐ కేంద్రంలో లోడ్ పెడుతున్నారని ఈ నెల 14న జరిగిన దిశ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పిన మాటలు ఇవి. ఇలా రైతులను దోపిడీకి గురి చేస్తున్నారంటూ తనకు ఫోన్‌లు వస్తున్నాయని ఆరోపించారు.


