మల్లన్న కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు
● కొమురవెల్లిలో భక్తులకు ఇబ్బందులు కలగవద్దు ● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం
సిద్దిపేటరూరల్: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కల్యాణం, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 14న ఉదయం 10.45 నిమిషాలకు స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, పార్కింగ్, బారీకెడ్లు, పోలీస్ కంట్రోల్ రూం, లడ్డూ కౌంటర్, భక్తుల క్యూలైన్, అన్నదానం వంటివి చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అదనపు డీసీపీ కుశాల్కర్, ఏసీబీ సదానందం, ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
చెత్త వాహనాలకు మెడికల్ వ్యర్థాలు ఇవ్వొద్దు
సిద్దిపేటరూరల్: చెత్త వాహనాలకు మెడికల్ వ్యర్థాలను ఇచ్చే ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వైద్యఆరోగ్య, పబ్లిక్ హెల్త్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వెటర్నరి, మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు.. బయోమెడికల్ వ్యర్థాలను ధర్మా అండ్ కంపెనీ ద్వారా తరలించాలన్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లు కేవలం ప్రాథమిక వైద్య సేవలను అందించడం వరకే పరిమితం చేయాలన్నారు.


