రోడ్డు దాటాలంటే భయమేస్తోంది..
● ప్రాణాలను బిగపట్టి.. దాటిస్తున్నాం ● సీపీకి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఫోన్‌కాల్ ● హుటాహుటినా చేరుకున్న విజయ్‌కుమార్ ● నియంత్రణ చర్యలపై ఆదేశాలు
గజ్వేల్: ‘సార్.. రోడ్డు దాటాలంటే భయమేస్తోంది. ప్రాణాలను బిగపట్టి పిల్లలను దాటిస్తున్నాం, ప్లీజ్... ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి..’ అంటూ
ఓ ఉపాధ్యాయుడు చేసిన ఫోన్ కాల్.. సీపీ విజయ్‌కుమార్‌ను కదలించింది. హుటాహుటినా ఆ ప్రదేశానికి చేరుకునేలా చేసింది. ఈ సంఘటన శనివారం గజ్వేల్ మండలం కొడకండ్లలో చోటుచేసుకుంది. గ్రామంలోని రాజీవ్‌రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరగడం, ఇదే క్రమంలో రోజూ బడి పూర్తి కాగానే రోడ్డు దాటించే సందర్భంలో వాహనాల వేగం, మలుపుల వద్ద నియంత్రణ పాటించకపోవడంతో ఏర్పడుతున్న ఇబ్బందులపై గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మదనాల శ్రీనివాస్ మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంతో సీపీ విజయ్‌కుమార్ కాల్ చేసి తెలిపారు. ఇదే సమయంలో వంటిమామిడి వద్ద రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సీపీ పరిశీలన జరుపుతున్నారు. ఉపాధ్యాయుడు ఫోన్‌కాల్‌తో హుటాహుటినా ఏసీపీ నర్సింహులు, ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్‌తోపాటు ట్రాఫిక్ సీఐ మురళి, రాజీవ్‌రహదారి నిర్మాణ పనుల సంస్థ హెచ్‌కేఆర్ ప్రతినిధులను వెంటబెట్టుకొని కొడకండ్లకు చేరుకున్నారు. తనకు కాల్ చేసిన ఉపాధ్యాయుడిని పిలిపించి రోడ్డు ప్రమాదాల ప్రదేశాలను పరిశీలించారు. సీపీ స్పందిస్తూ.. ప్రమాదాల నివారణకు స్టడ్స్ లేదా స్పీడ్ బ్రేకర్స్ ఇతర అంశాలను పరిశీలించి వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు డివైడర్ల మధ్యలో చెట్ల పొదల తొలగింపు, స్పీడ్ బ్రేకర్స్ ఇతర చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.


