మత్స్యకారులకు స్వర్ణయుగమే..
వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
గురుకులాలు, పాఠశాలల
మెనూలోనూ చేపల వంటకాలు
మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడి
మంత్రి పొన్నంతో
కలిసి చెరువులో చేప పిల్లల విడుదల
హుస్నాబాద్: రాష్ట్రంలో మత్స్యకారులకు స్వర్ణయగం తీసుకువస్తామని, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి 3 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. అంతకు ముందు శిఽథిలావస్థకు చేరిన వెటర్నరీ ఆస్పత్రి, అసంపూర్తిగా ఉన్న వెజ్, నాన్ వెజ్ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 165 చెరువులకు గాను 38.32 లక్షల ఉచిత చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ పశువైద్య శాల ఆధునీకరణ. చేపల మార్కెట్, స్టోరెజ్ సెంటర్, పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల మెనూలోనూ చేపల కూర ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లలకు కంటి చూపు, గుండె జబ్బులు రాకుండా చేపల పొడిని అందజేస్తామని తెలిపారు.
నాలుగు లేన్ల రహదారికి రూ.58 కోట్లు
హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు నాలుగు లేన్ల రహదారి కోసం రూ.58 కోట్లు మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్న కొనుగొళ్లు, ఆర్టీసీ బస్టాండ్‌లో వరద నీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యల పై ఆర్టీసీ అధికారులు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్‌థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు.


