వైద్య సేవలు మరింత మెరుగుపడాలి
కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: ప్రజలకు వైద్యం అందించడంలో సిబ్బంది మరింతగా సేవలను మెరుగుపరచాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పీహెచ్‌సీ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డెంగీ కేసుల పర్యవేక్షణ నిర్వహణపై పలు ఆదేశాలు జారీ చేశారు. టీబీ ముక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్క్రీనింగ్ పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపినందుకు అభినందనలు తెలిపారు. మాతా, శిశు మరణాలు, సీ సెక్షన్ ప్రసవాలను తగ్గించాలన్నారు. హాస్టల్స్‌లో ప్రత్యేక ఎనిమియా స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించాలన్నారు. జిల్లాను ఆరోగ్య సేవల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ధనరాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్ బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గుర్రాలగోంది పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అలాగే జక్కాపూర్‌లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నారాయణరావుపేట మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఫీల్డ్, మీటింగ్స్ పేరుతో విధులు నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఫోన్ ద్వారా హెచ్చరించారు.


