మల్లన్న చెంత.. వసతుల చింత
ట్రా‘ఫికర్’.. గుంతల రోడ్లు
●కొమురవెల్లిలో భక్తులకు తప్పని తిప్పలు ●సౌకర్యాల కల్పనలో విఫలం
●బ్రహ్మోత్సవాలపై నేడు సమీక్ష
పూర్తికాని 50 గదుల నిర్మాణం
బండ గుట్టపై నిర్మిస్తున్న 50 గదుల పనులు, క్యూ కాంప్లెక్స్, ఎల్లమ్మ గుట్టపై నిర్మిస్తున్న త్రిశూలం ఢమరుకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికి తోడు ఆలయంలో ఆర్జీత సేవలు, బుకింగ్ కార్యకలాపాలు, ఆన్‌లైన్ సేవలు, మాస్టర్ ప్లాన్, ఆలయ భూముల ఫెన్సింగ్, ఉప ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠ ప్రకటనలకే పరిమితం అయింది.
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న చెంత భక్తులకు వసతులు కరువయ్యాయి. వచ్చేనెల 14న స్వామి వారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నా యి. ఉత్సవాల నిర్వహణకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుగానే సమీక్ష నిర్వహించి వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేస్తామని చెబుతున్నా, కార్యరూపం దాల్చడం లేదు. శనివారం బ్రహ్మోత్సవాలపై కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈసారైనా అమలుకు నోచుకుంటాయా..? లేదా అని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
200 మందికే అన్నదానం
సాధారణ రోజుల్లో 100, జాతర సమయంలో 500 మందికి అన్నదానం చేస్తామని నాలుగేళ్ల క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించినప్పటికీ, అమలుకు నోచుకోలేదు. ఈవిషయాన్ని కమిషనర్‌కు పంపిస్తే ప్రతి ఆదివారం 200 మందికి అన్నదానం చేసేందుకు అనుమతి ఇచ్చా రు. కానీ 500 మందికి పెంచాలని భక్తులు కోరుతున్నారు. గతేడాది నిర్వహించిన సమీక్షలో స్వామి వారికి భక్తులు సమర్పించే పూలతో అగరబత్తీలను తయారు చేయాలని, భక్తులకు నీడ కోసం షామియానాల ఏర్పాటు, క్యూలైన్లలో తాగు నీటి వసతి కల్పించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆలయ అధికారులను ఆదేశించినా వారు పట్టించుకోలేదు.
కలగానే అమ్మవార్ల కిరీటాలు
మల్లన్నకు భక్తులు సమర్పించిన 8 కిలోల బంగారం ఉన్నప్పటికీ, స్వామివారికి కిలోన్నర పరిమాణంలో బంగారు కిరీటం చేయించారు. అమ్మవార్లకు సైతం కిరీటాలు చేయిస్తామని గత సమీక్ష సమావేశంలో తెలిపినా, కలగానే మిగిపోయింది.
మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి కొమురవెల్లి చేరుకుంటున్న క్రమంలో పోలీసులు ఆయా మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు చొచ్చుకు రాకుండా కిలోమీటర్ దూరంలో నిలిపివేస్తున్నారు. దీంతో భక్తులు కాలినడకన సామగ్రి వెంట తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొమురవెల్లి రావడానికి మూడు ప్రధాన దారులుండగా, అందులో తిమ్మారెడ్డిపల్లి, గుర్జకుంట కమాన్‌ల నుంచి కొమురవెల్లికి వచ్చే రోడ్లు గుంతలమయంగా మారాయి. అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఇబ్బంది కలుగకుండా మరమత్ములు చేయించాలి.
మల్లన్న చెంత.. వసతుల చింత


