వసతి.. ఇదేం దుస్థితి
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● రేకుల భవనంలో ఎస్సీ బాలికల వసతి భవనం ● అవస్థల మధ్యే విద్యాభ్యాసం
ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్యలే రాజ్యమేలుతున్నాయి. విద్యారంగానికి, విద్యార్థుల సంక్షేమానికి రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో చూస్తే అందుకు భిన్నంగా వసతి గృహాలు దర్శనమిస్తున్నాయి. అద్దె భవనాలు, ఇరుకు గదులు, అసౌకర్యాల మధ్యే విద్యార్థులు విద్యాభాస్యం కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది.
– దుబ్బాకటౌన్
దుబ్బాక పట్టణంలోని బీసీ బాలుర కళాశాల వసతి గృహం పాత పెంకుటింట్లో 30 మంది విద్యార్థులతో ఇరుకు గదుల మధ్య కొనసాగుతోంది. ఇక్కడ వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సాంఘిక, బీసీ సంక్షేమ అధికారులు కనీసం కన్నెత్తి చూడటంలేదని విద్యార్థులు వాపోతు న్నారు. అలాగే పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలోనూ సమస్యలే దర్శనమిస్తున్నాయి. గతంలో వందల మంది బాలికలతో కళకళలాడగా, నేడు శిథిలావస్థలకు చేరిన అద్దె భవనంలో కేవలం 40 మంది విద్యార్థినులతో వెలవెలబోతోంది. మరమ్మతులు, వసతులు చేపట్టక పోవడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూవస్తోంది. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ భవనం ఎక్కడ కూలిపోతుందోనన్న భయంతో అధికారులు కొంతకాలం పాటు పక్కనే ఉన్న బీసీ బాలికల వసతి గృహంలోని రెండు గదుల్లో తాత్కాలికంగా వసతి కల్పించారు.
గోడలకు పగుళ్లు..
రెండేళ్ల కిందట పట్టణ శివారులోని రేకుల అద్దె భవనంలోకి బాలికల వసతి గృహాన్ని మార్చారు. ప్రస్తుతం ఆరు రేకుల గదులతో కూడిన గదుల్లో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు గదుల్లో కొన్ని చోట్ల పైకప్పు రేకులు పగిలిపోవడంతో వాటిపై ప్లాస్టిక్ కవర్లను పరిచారు. గదుల్లో గోడలకు అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయి.
వేడి నీరు లేక..
వేడి నీటిని అందించే గీజర్లు లేక పోవడంతో వర్షాకాలం, చలికాలంలో బాలికలకు చన్నీటి స్నానాలే దిక్కవుతున్నాయి. మరుగుదొడ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
పెంకుటింట్లోనే బాలుర వసతి గృహం
వసతి.. ఇదేం దుస్థితి
వసతి.. ఇదేం దుస్థితి
వసతి.. ఇదేం దుస్థితి


