డ్రాలో దక్కించుకున్న 20 మంది మహిళలు
● కలెక్టర్ సమక్షంలో మద్యం దుకాణాల కేటాయింపు ● సిద్దిపేట పట్టణం సీసీ గార్డెన్‌లో సందడి వాతావరణం
సిద్దిపేటకమాన్: నూతన మద్యం పాలసీ ప్రకారం లైసెన్స్‌ల కేటాయింపు ఆసక్తికరంగా సాగింది. లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయించారు. లక్కీ డ్రాలో 20 మంది మహిళలు వైన్ షాపులు దక్కించుకోవడం విశేషం. జిల్లా కేంద్రంలోని సీసీ గార్డెన్‌లో సోమవారం మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఎకై ్సజ్ అధికారులు నిర్వహించారు. కలెక్టర్ హైమావతి హాజరై మొదటి దుకాణానికి లక్కీ డ్రా ద్వారా టోకెన్ నంబర్ 16 ఎంపిక చేసి ప్రారంభించారు. లైసెన్స్‌దారుడు ప్రశాంత్‌రెడ్డి ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. డివిజన్ వారీగా దరఖాస్తుదారులను హాల్‌లోనికి అనుమతించారు. ఫంక్షన్ హాల్ ఆవరణలో ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఆశావహులకు లక్కీ డ్రా నిర్వహణ కనిపించేలా ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు అధిక సంఖ్యలో రావడంతో ఫంక్షన్‌హాల్ ప్రాంతం సందడి వాతావరణం నెలకొంది. డ్రాలో వైన్ షాప్‌లు దక్కించుకున్న వారు సంతోషంతో శుభాకాంక్షలు తెలుపుకుని, స్వీట్లు పంపిణీ చేశారు.
20 టోకెన్లు వేస్తే..
25 మంది సిండికేట్‌గా ఏర్పడి 20టోకెన్లు వేయగా వరుసగా రెండు దుకాణాలను డ్రాలో దక్కించుకున్నారు. జిల్లాలోని 93 మద్యం దుకాణాల నిర్వహణకు నూతన మద్యం పాలసీలో భాగంగా గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించగా 2,782 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. తీగుల్ నర్సాపూర్‌లోని 51వ షాప్‌కు 73 మంది దరఖాస్తు చేసుకోగా డ్రాలో వెంకటేశ్‌గౌడ్ దక్కించుకున్నారు. 50వ షాప్‌కు 63 దరఖాస్తులు రాగా డ్రాలో ఉడుత దేవయ్యకు దక్కింది. పది మంది గ్రూప్‌గా ఏర్పడి 20దుకాణాలకు దరఖాస్తు చేసినా ఒక్క వైన్ షాప్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని 93 వైన్ షాప్‌లను దక్కించుకున్న వారు మంగళవారం సాయంత్రం లోగా లైసెన్స్ ఫీజులో 1/6వ వంతు ఫీజు ప్రభుత్వ ఖజానాకు డీడీ రూపంలో చెల్లించాలని తెలిపారు.
డ్రాలో దక్కించుకున్న 20 మంది మహిళలు


