ఇంటర్ విద్యలో గుణాత్మక మార్పులు
● ఆన్‌లైన్‌లో అటెండెన్స్, టీచింగ్ డైరీలు ● అన్ని కళాశాలల్లోనూ ఎఫ్‌ఆర్‌ఎస్ తప్పనిసరి ● ప్రత్యేకాధికారి కిషన్
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యలో ప్రభుత్వం గుణాత్మక మార్పులు తీసుకువస్తున్నదని ప్రత్యేకాధికారి కిషన్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులు, నిర్వహణకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో సోమవారం జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌రెడ్డితో కలిసి ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అందులో భాగంగా ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధ్యాపకులు, విద్యార్థుల హాజరు పెంచేందుకు తీసుకు వచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేయడంలో ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తప్పని సరిగా ప్రతి విద్యార్థిని ఎఫ్‌ఆర్‌ఎస్‌లో రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. అధ్యాపకుల టీచింగ్ డైరీలు సైతం ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ప్రతి తరగతి గదిలో సీసీ కెమరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశామన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
డీఐఈఓ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నే డిసెంటర్ మొదటి వారంలోగా సిలబస్ పూర్తి చేయాలన్నారు. స్టడీ అవర్‌లు నిర్వహించి ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు సమన్వయంతో పనిచేయాలన్నారు.


