అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 168
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అందిస్తున్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 168 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ బిల్లులు అందించాలి..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి అయిన వారికి రూ.లక్ష జమకాలేదని కోరుతూ లబ్ధిదారులు వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరగా ఇల్లు నిర్మించుకుందామని ఆశపడితే చివరకు డబ్బులు సరిగ్గా రావడం లేదని వాపోయారు. అధికారులను అడిగితే జమ అవుతాయని బదులివ్వడమే తప్ప కావడంలేదన్నారు.
మూడు రోజుల పాటు వరి కోతలు వద్దు
మొంథా తుపాన్ నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు వరి కోతలు చేయరాదని కలెక్టర్ హైమావతి రైతులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షల 3వేల మెట్రిక్ టన్ను ల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో 418 కొనుగోలు కేంద్రాలు గుర్తించి వాటి లో 407 ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 3,483 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలుకై 10 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులకు తెలిపారు. వరిధాన్యం, మొక్కజొన్న, ప్రత్తి కొనుగోలుకై ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఎండలో అర్జీదారుల పడిగాపులు
అర్జీదారులు ఎండలో పడిగాపులు కాశారు. అర్జీలు కలెక్టర్‌కు అందించేందుకు వచ్చిన ప్రజలకు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులను పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేశారు. ఉదయం 11 గంటలకు ప్రజావాణి ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు టోకెన్స్ సిస్టం ద్వారా లోపలికి పంపించారు. కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు ఎండలో చాలాసేపు వేచి ఉండటంపై విచారం వ్యక్తం చేశారు.
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి


